ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు!

Rave Party At Rushikonda - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు తమ కాసుల కక్కుర్తితో యువతను పెడదారి పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు నిర్వహిస్తూ విశాఖలో విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. తాజాగా రుషికొండ ఇసుక తిన్నెలపై ఈవెంట్‌ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారు. అయితే వీటిని ఈవెంట్ల కింద చూపిస్తూ.. కాశీ విశ్వనాథ్‌(జిల్లా మంత్రి అనుచరుడు)కు చెందిన ‘విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పర్యాటక శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. వాస్తవానికి సాగరతీరంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఈవెంట్ల నిర్వహణకు లైసెన్స్‌ ఇవ్వకూడదని గతేడాది హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ మంత్రి అనుచరుడు కావడం, ముడుపులు ముట్టడంతో ఎలాంటి అడ్డు చెప్పకుండా.. పర్యాటక శాఖ అనుమతులిచ్చేసింది.
 
రేవ్‌ పార్టీతో బోణీ..
రుషికొండ సాగరతీరం సర్వే నంబర్‌ 61లో బీచ్‌ సంబంధిత క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ పేరిట విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నుంచి 15 ఏళ్లకు గానూ లీజు అనుమతులు తెచ్చుకుంది. నెలకు రూ.2 లక్షల చొప్పున ఏడాదికి రూ.24 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత స్థాయిలో అధికార బలాన్ని ఉపయోగించి ఆగమేఘాలపై లైన్‌ క్లియర్‌ చేయించుకుంది. ఏపీటీడీసీలో ప్రాజెక్ట్సు చూసే ఓ ఉన్నతాధికారి ఇందుకు సహకరించడంతో అనుమతులు తేలిగ్గా వచ్చేశాయి. విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ఏపీటీడీసీతో లీజు ఒప్పందం కుదుర్చుకుందన్న సంగతి ఆ శాఖలో చాలామంది అధికారులకు తెలియకపోవడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రికి విశ్వనాథ్‌ ప్రధాన అనుచరుడిగా ఉండడం వల్ల లీజు పని సులువైనట్లు తెలిసింది. ఈ సంస్థ ఈవెంట్లకు అవసరమైన రెస్టారెంట్లు, ఇతర ఏర్పాట్లను కూడా పూర్తి చేయలేదు. కానీ ఈ సంస్థ రెండ్రోజుల క్రితం రేవ్‌ పార్టీతో ‘ఈవెంట్‌కు’ బోణీ కొట్టింది. మద్యంతో పాటు మాదకద్రవ్యాలను సేవించిన పలువురు యువతీ, యువకులు ఒళ్లు మరిచి చిందులేశారు. మసక చీకట్లో ఇసుక తిన్నెలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విశాఖ ఖ్యాతిని మంటగలిపారు.  

ఎక్సైజ్‌ అధికారుల అత్యుత్సాహం..
ఇక ఈవెంట్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ రేవ్‌ పార్టీకి ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈనెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్‌లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్‌ కుమారుడు నరేంద్రకుమార్‌ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్‌ శాఖ అనుమతించకూడదు. లిక్కర్‌ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది.

ఒకరి అరెస్టు..
రుషికొండ రేవ్‌ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవ పోలీసులు అతని నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రుషికొండ విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ లీజుదారుడు బి.నరేంద్రకుమార్, రేవ్‌ పార్టీ నిర్వాహకుడు సోను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఏపీటీడీసీ డీవీఎం ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ సంస్థ రేవ్‌ పార్టీ నిర్వహించిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

హైకోర్టు ఆదేశాలు తోసిరాజని..
సాగరతీరంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎలాంటి ఈవెంట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని 2018 మే 1న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొట్లకొండలో ఓ రెస్టారెంట్‌ ఏర్పాటుకు సంబంధించి విశాఖ టౌన్‌ ఫిషర్‌ ఉమెన్‌ డ్రైఫిష్‌ కోపరేటివ్‌ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ మేరకు ఏపీటీడీసీకి ఆదేశాలిచ్చింది. కాగా, ఫిషర్‌మెన్‌ యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు చెందిన తెడ్డు శంకర్‌ మాట్లాడుతూ.. తాజా వ్యవహారంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top