రామోజీకి అమ్ముడుపోయారు | Ramoji Film City Staff and Workers Union strike at RTC cross road | Sakshi
Sakshi News home page

రామోజీకి అమ్ముడుపోయారు

Sep 17 2013 2:20 AM | Updated on Sep 1 2017 10:46 PM

రామోజీకి అమ్ముడుపోయారు

రామోజీకి అమ్ముడుపోయారు

రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

సాక్షి, హైదరాబాద్: కార్మికులకు, కార్మికశాఖ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించటంలో కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్మికుల జీవితాలతో ఫిల్మ్‌సిటీ యాజమాన్యం, కార్మికశాఖ అధికారులు చెలగాటమాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికశాఖ జీవో 63ను ప్రశ్నిస్తూ, దానికి వ్యతిరేకంగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం రిట్ పిటిషన్ నెం 2495/2011 తో స్టే తెచ్చుకుందని, నెలలు దాటుతున్నా ఈ కేసులో కౌంటరు దాఖలు చేయటంలో కార్మికశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రామోజీ యాజమాన్యానికి కార్మికశాఖ అధికారులు అమ్ముడుపోయారని, అందుకే స్టే వెకేట్ చేయించటంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సలహాదారులు ఎం బాబ్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, ప్రధాన కార్యదర్శి జి సైదులు ఆరోపించారు.
 
  వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ కార్మిక సంఘం నోటీసు ఇస్తే..  పరిష్కరించాల్సిన యాజమాన్యం కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. ఇరవై ఐదు మంది కార్మికులను తొలగించినట్లుగా ప్రకటించిన యాజమాన్యం ఇప్పటివరకు సెటిల్‌మెంట్ పంపటంలేదన్నారు. సెటిల్‌మెంట్ పంపితే తాము న్యాయపరంగా పోరాడేవారమని, ప్రస్తుతం అటు డ్యూటీకి వెళ్లకుండా, ఇటు వేతనాలు రాక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. కార్మికులు 17, 18 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం రూ. 10 వేలకు మించి ఇవ్వటం లేదని, ఉద్యోగ భదత్ర, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లను పట్టించుకోవటం లేదని చెప్పారు. ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు రంగారెడ్డి జేసీఎల్ అజయ్‌ను కలిసి రామోజీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను వెకేట్ చేయించేందుకు సత్వరమే కౌంటరు దాఖలు చేయాలని వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామకృష్ణ, మహేందర్, కె.బాలరాజు, ఎన్.మధు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement