పాతోళ్లం కనిపించమా? | Rajampet | Sakshi
Sakshi News home page

పాతోళ్లం కనిపించమా?

Apr 18 2015 3:38 AM | Updated on Aug 10 2018 8:13 PM

జిల్లాలో టీడీపీకి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట నియోజకవర్గంలో నేతల విభేదాలు రచ్చకెక్కాయి.

 రాజంపేట : జిల్లాలో టీడీపీకి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట నియోజకవర్గంలో నేతల విభేదాలు రచ్చకెక్కాయి. ఒంటిమిట్ట, సుండుపల్లె మండల కమిటీ ఎన్నికల ప్రక్రియ రసాభాసాగా మారింది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె, సిద్ధవటం, వీరబల్లి మండలాల నేతలు శుక్రవారం రాజంపేట పట్టణంలోని కళాంజలి గార్డెన్స్‌లో సమావేశమయ్యారు.
 
 మండల కమిటీ అధ్యక్షుల పేర్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రకటించడం మొదలుపెట్టారు. రాజంపేట, నందలూరు, వీరబల్లి మండల కమిటీలను ప్రకటించారు. అంతలో.. గ్రామ కమిటీలు ఏకపక్షంగా జరిగాయని కొందరు, లాడ్జిలో కూర్చొని జాబితా తయారు చేశారని మరికొందరు ఆరోపిస్తూ వేదిక వద్దకు దూసుకొచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమావేశం గందరగోళంగా మారింది. సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు విమర్శించారు.
 
 ఒంటిమిట్టతో రసాభాస..
 ఒంటిమిట్ట అధ్యక్షునిగా వెంకట నరసయ్య పేరును ప్రకటించగానే, అదే మండలానికి చెందిన కొత్తపల్లె శ్రీనువాసులు, పంచవెంకటయ్య, రాజుకుంటపల్లె రమణ, వెంకటరెడ్డి, గజ్జెల సుబ్బారెడ్డి, అడ్వకేట్ రామదాసు, ఈశ్వరయ్య, కట్టానారాయణ ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకువచ్చారు. వెంకట నరసయ్య వద్దంటూ.. మరొకరిని అధ్యక్షునిగా నియమించాలని నిలదీశారు. లింగారెడ్డి, మేడా.. జోక్యం చేసుకొని సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. ఇది ప్రతిపాదన మాత్రమే అని, గజ్జెల సుబ్బారెడ్డి, రామదాసు పేర్లు కూడా అధిష్టానానికి పంపుతామని, తుది నిర్ణయం అధిష్టానందేనని శాంతింపజేశారు.
 
 సుండుపల్లెలో సీనియర్లు వర్సెస్ తెలుగు కాంగ్రెస్
 సుండుపల్లె కమిటీని ప్రకటించేసరికి సీనియర్లు, తెలుగు కాంగ్రెస్ కమిటి నేతలకు మధ్య అధ్యక్ష పదవి కేటాయింపు విషయంలో తేడాలు పొడచూపాయి. కమిటి అధ్యక్షునిగా మహేష్‌రాజు పేరును ప్రకటించే సమయంలో, ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న శివకుమార్‌నాయుడు వర్గం ఊవ్వెత్తున ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఇరు వర్గాల వారు పరస్పరం దూషించుకున్నారు. తాము పాతోళ్లమని, కాంగ్రెస్‌లో ఉండి.. రెండేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన మహేష్‌రాజుకు నాయకత్వ బాధ్యతలు ఎలా ఇస్తారని శివకుమార్‌నాయుడు వర్గం నిలదీసింది. లింగారెడ్డి జోక్యం చేసుకొని సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తుదకు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాల వారిని దూరంగా పంపించారు.  
 
 నేనేమైనా వైఎస్సార్‌కు పనిచేస్తున్నానా?
 శివకుమార్‌నాయుడు, మహేష్‌రాజు వర్గీయులు గొడవ పడటం, సుండెపల్లె నేతలు నిలదీయడంతో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సహనం కోల్పోయారు. మీరొక్కరే తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నారా? నేనేమైనా వైఎస్సార్ పార్టీకి పని చేస్తున్నానా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఎవరూ గొడవ పడాల్సిన పని లేదు.. ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపుతాం. పై స్థాయిలో నిర్ణయం జరుగుతుందని అందరికీ సర్దిచెబుతుండగా, అక్కడ కాదు.. ఇక్కడే లేల్చితేనే న్యాయం జరుగుతుందని కొందరు నేతలు పట్టుపట్టారు. దీంతో రసాభాసగా మారిపోయింది. అంతలో పలువురు నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. సుండుపల్లె మండలానికి చెందిన సీనియర్లు అలిగి వెళ్లిపోయారు. సుండుపల్లె, ఒంటిమిట్ట మండల కమిటీల ఎంపిక నిలిచిపోయింది. కాగా, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య వర్గం దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement