
ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జంషెడ్‌పూర్‌కు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో, కియాంజిర్‌గఢ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. గడచిన 24 గంటల్లో సోంపేట, కళింగపట్నంలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.