నట్టేట్లో పోలవరం నాణ్యత

Quality deficiencies in Copper Dam jet grouting works are exposed - Sakshi

కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనుల్లో నాణ్యతా లోపాలు బహిర్గతం 

గోదావరిలో సాధారణ వరద ప్రవాహానికే కొట్టుకుపోయిన జెట్‌ గ్రౌటింగ్‌ 

డెన్సిఫికేషన్‌ చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్, కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తున్న వైనం 

పనులు సక్రమంగా చేయకపోయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం 

లోపాలు సరిదిద్దకపోతే జలాశయం భద్రతకు ముప్పు తప్పదంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి:  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనుల్లో నాణ్యతా లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గోదావరి నదిలో సాధారణ వరద ప్రవాహానికే కాఫర్‌ డ్యామ్‌ పునాది(జెట్‌ గ్రౌటింగ్‌) కొట్టుకుపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకే ‘నామినేషన్‌ విధానం’లో పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లు పనులు ఎలా చేసినా అభ్యంతరం చెప్పకుండా బిల్లులు చెల్లించేలా.. వాటి పర్యవేక్షణకు, నాణ్యత పరిశీలనకు వేర్వేరుగా చీఫ్‌ ఇంజనీర్లను నియమించకుండా ఒకే చీఫ్‌ ఇంజనీర్‌ను నియమించారు. దాంతో పనులు నాసిరకంగా చేసినా నాణ్యంగా ఉన్నట్లుగా ధ్రువీకరించి, బిల్లులు మంజూరు చేస్తున్నారు. పోలవరం జలాశయం స్పిల్‌ వే(కాంక్రీట్‌ ఆనకట్ట)లో చీలికలు ఏర్పడ్డాయి. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నాణ్యతా లోపాలను బహిర్గతం చేసింది. ఇటీవల లోక్‌సభ, శాసనసభలకు సమర్పించిన నివేదికల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కడిగి పారేసింది. 

తూతూమంత్రంగా జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 
గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు నీటిని విడుదల చేసేలా పోలవరం జలాశయం డిజైన్‌ రూపొందించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులు పూర్తయ్యేలోగా 41.5 మీటర్ల ఎత్తున నిర్మించే కాఫర్‌ డ్యామ్‌లోనే నీటిని నిల్వ చేసి, వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీపై కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు.  కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి పునాదిని షీట్‌ ఫైల్స్‌ విధానంలో వేయాలి. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కాఫర్‌ డ్యామ్‌ పునాది పనులను కెల్లర్‌ అనే సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు. జెట్‌ గ్రౌటింగ్‌ విధానంలో కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది.

గోదావరి నదీ గర్భంలో ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన, దిగువన కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే ప్రాంతంలో ప్రతి 1.5 మీటర్లకూ రాతి పొర వచ్చే వరకూ బోరు బావి తవ్వి, అధిక ఒత్తిడితో సిమెంట్, ఇసుక, బెంటనైట్‌ మిశ్రమాన్ని పంపితే భూగర్భంలో ఏవైనా చీలికలు ఉంటే మూసుకుపోయి అత్యంత పటిష్టవంతమైన ఒక గోడ తరహాలో పొర తయారవుతుంది. దీనివల్ల చుక్క నీరు కూడా లీకవ్వదు. దీన్నే జెట్‌ గ్రౌటింగ్‌ అంటారు. ఈ పునాదిపైనే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి.  ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులను 2308 కాలమ్స్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 945 కాలమ్స్‌ ద్వారా పూర్తి చేశామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ, ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అందువల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్‌ గ్రౌటింగ్‌ పునాది కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ సీనియర్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. 

డెన్సిఫికేషన్‌ చేయకుండానే.. 
ఇసుక తిన్నెల్లో నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 500 మీటర్లు.. దిగువన 500 మీటర్ల పొడవున నదీ గర్భంలో డెన్సిఫికేషన్‌(సాంద్రీకరణ) విధానంలో ఇసుక పొరలను పటిష్టం చేయాలి. యంత్రాలతో అధిక ఒత్తిడితో ఇసుక పొరలను కూరాలి. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన.. దిగువన నదీ గర్భంలో గట్టి పొర ఏర్పడుతుంది. నీరు లీకేజీ కాదు. కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌ల భద్రతకు డోకా ఉండదు. అయితే, కాంట్రాక్టర్‌ డెన్సిఫికేషన్‌ సక్రమంగా చేయలేదని ఆ పనులను పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. డెన్సిఫికేషన్‌ చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్, ఈసీఆర్‌ఎఫ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేశారు. ఇసుక పొరల్లో చీలికలు యథాతథంగా ఉండిపోయాయి. దాంతో భూగర్భంలో నీటి లీకేజీలు కావడం వల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్‌ గ్రౌటింగ్‌ కొట్టుకుపోయిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పనులు సైతం అక్కడక్కడ కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. నాణ్యతా లోపాలను సరిదిద్దకుండా కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌లను నిర్మిస్తే జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top