పురుషోత్తంసాగర్‌కు భారీ గండి | Purushottam Sagar to the large break | Sakshi
Sakshi News home page

పురుషోత్తంసాగర్‌కు భారీ గండి

Sep 21 2013 4:24 AM | Updated on Sep 2 2018 4:46 PM

టెక్కలి సమీపంలోని పురుషోత్తం సాగర్ చెరువుకు శుక్రవారం భారీ గండి పడింది. ఫలితంగా ఇదే ప్రాంతంలో ఇటీవల సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మదుము పనులకు నష్టం వాటిల్లింది.

టెక్కలి రూరల్, న్యూస్‌లైన్ : టెక్కలి సమీపంలోని పురుషోత్తం సాగర్ చెరువుకు శుక్రవారం భారీ గండి పడింది. ఫలితంగా ఇదే ప్రాంతంలో ఇటీవల సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మదుము పనులకు నష్టం వాటిల్లింది. సాగరానికి గండిపడిన విషయం తెలిసి ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం గండి పడిన ప్రాంతంలో మూడు నెలల క్రితం నీలం తుఫాన్ నిధులతో కాంట్రాక్టర్ చేపట్టిన మదుము నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని అప్పట్లో గగ్గోలు పెట్టినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడిలా జరిగిందని రైతులు ఆరోపించారు. 
 
 గండి నుంచి దిగువకు వెళుతున్న నీరు వంశధార కాలువలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా మదనగోపాలసాగరానికి చేరుతోంది. దీనివల్ల దానికి మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మదనగోపాలసాగరానికి గత నెలలో పడ్డ భారీ గండి వల్ల నారుమళ్లతో ఉన్న పొలాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే.
 
 మదుము నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పురుషోత్తంసాగర్‌కు గండి పడటం, సమైక్య ఉద్యమం కారణంగా అధికారులు అందుబాటులో లేక పూడ్చివేత పనులు ప్రారంభమవకపోవటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతు కోళ పాపారావు వాపోయారు. పురుషోత్తంసాగర్ కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులకు దిక్కుతోచటం లేదు.
x

Advertisement
 
Advertisement
Advertisement