breaking news
Purushottam Sagar
-
పురుషోత్తం సాగర్ స్థలంపై మళ్లీ వివాదం
టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలో గల పురుషోత్తం సాగర్ స్థల వివాదం మరోసారి చెలరేగింది. సర్వే నంబర్ 55/3లో సుమారు ఏడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో కంచె వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో ఆదిఆంధ్రవీధి వాసులు అక్కడికి చేరుకున్నారు. తమ సంఘ నిధులు రూ.4 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టామని పేర్కొంటూ కంచెలకు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలను బలవంతంగా తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు చేపడతామని ఎస్సై పి.నర్సింహమూర్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదిఆంధ్రవీధివాసులు ఈ స్థలం తమకు కేటాయించారని మూడు రోజులు గడువు ఇస్తే ఆధారాలు తెస్తామని చెప్పారు. దీంతో దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు మూడు రోజుల గడువు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
పురుషోత్తంసాగర్‌కు భారీ గండి
టెక్కలి రూరల్, న్యూస్‌లైన్ : టెక్కలి సమీపంలోని పురుషోత్తం సాగర్ చెరువుకు శుక్రవారం భారీ గండి పడింది. ఫలితంగా ఇదే ప్రాంతంలో ఇటీవల సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మదుము పనులకు నష్టం వాటిల్లింది. సాగరానికి గండిపడిన విషయం తెలిసి ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం గండి పడిన ప్రాంతంలో మూడు నెలల క్రితం నీలం తుఫాన్ నిధులతో కాంట్రాక్టర్ చేపట్టిన మదుము నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని అప్పట్లో గగ్గోలు పెట్టినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడిలా జరిగిందని రైతులు ఆరోపించారు. గండి నుంచి దిగువకు వెళుతున్న నీరు వంశధార కాలువలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా మదనగోపాలసాగరానికి చేరుతోంది. దీనివల్ల దానికి మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మదనగోపాలసాగరానికి గత నెలలో పడ్డ భారీ గండి వల్ల నారుమళ్లతో ఉన్న పొలాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. మదుము నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పురుషోత్తంసాగర్‌కు గండి పడటం, సమైక్య ఉద్యమం కారణంగా అధికారులు అందుబాటులో లేక పూడ్చివేత పనులు ప్రారంభమవకపోవటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతు కోళ పాపారావు వాపోయారు. పురుషోత్తంసాగర్ కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులకు దిక్కుతోచటం లేదు. x