ఓటేస్తారా... ఇళ్లు కూల్చమంటారా?

The Promises Of Ruling Party Leaders Are Derived Bogus - Sakshi

టీడీపీకి ఓటేయకపోతే తక్షణమే ఇళ్లు కూల్చేస్తాం

రూ.10 వేలు ఇస్తాం.. ఖాళీ చేయాలంటూ రైల్వే కాంట్రాక్టర్ల హుకుం

అధికార పార్టీ నేతల హామీలు బూటకం

సాక్షి, నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): రైల్వే స్థలాల్లో 40 ఏళ్లుగా స్థిర నివాసాలను ఏర్పర్చుకొని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలకు బెదిరింపుల పర్వం ఎదురవుతోంది. అండగా ఉండాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి ఓటేయకపోతే ఇళ్లు కూల్చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.10 వేలు తీసుకొని వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలంటూ రైల్వే కాంట్రాక్టర్లు.. తామిచ్చిన అపార్ట్‌మెంట్లను తీసుకొని రోజూ రూ.30 దాచుకొని నెలకు రూ.1800 చెల్లించాలని, లేని పక్షంలో తామేమీ చేయలేమని అధికార పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక రైల్వే నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ తీసుకోవాల్సిందే..
ఇళ్లు కోల్పోయిన వారికి జనార్దన్‌రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో ఇళ్లు కేటాయిస్తామని, దీనికి గానూ నెలకు రూ.1800 మేర చెల్లించాలని అధికార పార్టీ నేతలు ఉచిత సలహా ఇచ్చారు. అయితే నిర్వాసితులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కొత్తూరులోని వైఎస్సార్‌నగర్‌లో పాడుబడిన ఇళ్లను ఇస్తామని, అక్కడికి వెళ్లకపోతే తామేమీ చేయలేమంటూ బెదిరించారు. తాజాగా కొన్ని రోజుల నుంచి రైల్వే కాంట్రాక్టర్ల బెదిరింపు పర్వం ప్రారంభమైంది. రూ.10 వేలను ఇస్తామని, వెంటనే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు. దీనిపై నిర్వాసితులు ఆందోళనతో ఉన్నారు.

మొదటి నుంచి అండగా ఎమ్మెల్యే అనిల్‌
మూడో రైల్వే లైన్‌ పనులకు గతేడాది రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వెంకటేశ్వరపురం, బర్మాషెల్‌గుంట, తదితర ప్రాంతాల్లో 40 ఏళ్ల నుంచి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్న 500 గృహాలకు హద్దులు నిర్ణయించి ఇళ్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే తమకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను చూపించాకే తొలగించాలంటూ వీరు స్పష్టం చేశారు. వీరికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌ అండగా నిలిచి హైకోర్టును ఆశ్రయించారు. స్టే రావడంతో ఇళ్ల తొలగింపు ఆగిపోయింది. జనార్దన్‌రెడ్డికాలనీలో గల 60 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ స్థలాల్లో నిర్వాసితులకు తొమ్మిది అంకణాలను ప్రభుత్వం ఇస్తే వారు ఇళ్లు నిర్మించుకునేందుకు తన వంతు సాయం చేస్తానని భరోసా సైతం ఇచ్చారు. మరోవైపు రైల్వేలైన్‌ నిర్మాణ పనులను నివాసాల పక్కన కాకుండా వేరే చోట ప్రారంభించారు.

పాడుబడిన ఇళ్లకు వెళ్లాలంటున్నారు
40 ఏళ్ల నుంచి అన్ని వసతులు కలిగిన వెంకటేశ్వరపురాన్ని వదిలి వెళ్లమంటున్నారు. అపార్ట్‌మెంట్లు నచ్చకపోతే, సౌకర్యాల్లేని పాడుబడిన కొత్తూరులోని ఇళ్లకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి రక్షణ లేని ప్రాంతానికి ఎలా వెళ్తాం.
– మస్తాన్‌బీ, రైల్వే నిర్వాసితులు

ఎమ్మెల్యే అనిల్‌ ఎంతకాలం కాపాడతారో...
ఎమ్మెల్యే అనిల్‌ ఎంతకాలం కాపాడతారో చూస్తామని బెదిరిస్తున్నారు. మొదట్నుంచి మాకు అండగా ఉంది ఆయనే. అనిల్‌ను గెలిపించుకొని ఇళ్లను కాపాడుకుంటాం.
–  సీతమ్మ, రైల్వే నిర్వాసితులు

హామీ ఇచ్చి ఇప్పుడిలా మాట్లాడటం సరికాదు
ఇళ్లను కూల్చే సమయంలో ఎమ్మెల్యే అనిల్‌ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. మరుసటి రోజు టీడీపీ నాయకుడు ఇళ్లను కూల్చకుండా తామే ఆపామని చెప్పి వెళ్లిపోయారు. తాజాగా ఆ నాయకుడే ఇక్కడికి వచ్చి అపార్ట్‌మెంట్లు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.
– మీరాంబీ, రైల్వే నిర్వాసితులు

ఇళ్లు కూల్చేస్తే మా పరిస్థితేంటి..?
వెంకటేశ్వరపురంలో 45 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. ఇన్నేళ్ల అనుబంధం ఉన్న ఈ ప్రాంతాన్ని వదిలి కొత్తూరు వెళ్లాలని బెదిరిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కడైనా ఖాళీ జాగా ఇస్తే పూరిపాక వేసుకొని హాయిగా జీవిస్తాం.
– బిల్లుపాటి మాల్యాద్రి, రైల్వే నిర్వాసితుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top