కోట్లు దండుకుని బోర్డు తిప్పేశారు!

Private Finance Done Fraud In Chitoor - Sakshi

రూ.3కోట్లకు పైగా వసూలు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు, ఏజెంట్లు 

సాక్షి, పలమనేరు : ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. పలమనేరులో మంగళవారం ఇది వెలుగుచూసింది.  స్థానిక ఏజెంట్ల మాయమాటలతో మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం...హెచ్‌బీఎన్, అసూర్‌ అనే ప్రైవేటు సంస్థల పేరిట పలమనేరుతోపాటు జిల్లాలోని పలుచోట్ల కార్యాలయాలను రెండేళ్ల క్రితం నిర్వాహకులు ప్రారంభించారు. ఆయా మండలాల్లో ఏజెంట్లను నియమించారు. తమ వద్ద రూ.500 నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్‌ కడితే ఆపై రుణాలిస్తామంటూ ప్రచారం చేయించారు.

దీంతో స్థానిక ఏజెంట్లు తమకు తెలిసిన వారి నుంచి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా కట్టించారు. అయితే హెచ్‌బీఎన్‌లో కంటే అసూర్‌ కంపెనీలో బాగా లాభాలున్నాయంటూ ఇందుకు సంబందించిన ముఖ్య ఏజెంట్లు హరినాథ్‌రెడ్డి, దేవరాజులు స్థానిక ఏజెంట్లను నమ్మించారు. అయితే ఆ తర్వాత ఆ కార్యాలయాలు బోర్డు తిప్పేశాయి. దీంతో డబ్బులు కట్టిన జనం ఏజెంట్లను నిలదీశారు. వారు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు, ఏజెంట్లు కలసి డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా డిపాజిట్ల రూపంలో ఇలా వసూలు చేసిన డబ్బు రూ.3కోట్లకుపైగా ఉంటుందని ఏజెంట్లు చెబు తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ మాటలు నమ్మి, లక్షలు కట్టించి, మోసపోయామని జరావారిపల్లెకు చెందిన ఏజెంట్‌ కళావతి వాపోయింది. తాను రూ.50లక్షలు డిపాజిట్ల రూపేణా కట్టించానని, నిర్వాహకులు అదృశ్యం కావడంతో అందరూ తనను నిలదీస్తుండడంతో తనకు దిక్కుతోచడం లేదని తొరిడి గ్రామానికి చెందిన ఏజెంట్‌ రుక్మిణి కన్నీటిపర్యంతమైంది. తాను ఏజెంట్‌గా వీ.కోట మండలంలో రూ.20లక్షల వరకూ కట్టించానని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారంటూ  దొడ్డిపల్లెకు చెందిన మోహన్‌ ఆక్రోశించాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top