అర్చక లోకం.. ఆనంద మంత్రం

Priests Thanked CM Jagan For Restoring Hereditary Archaka System - Sakshi

వంశపారంపర్య హక్కు పునరుద్ధరణ జీవో జారీ 

నెరవేరిన అర్చకుల చిరకాల వాంఛ

సీఎం జగన్‌కు అభినందనల వెల్లువ 

మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అర్చకుల కల నేరవేరింది. గత ప్రభుత్వ హయాంలో వంశపారంపర్య అర్చకత్వం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. నేడు,రేపు అంటూ తెలుగుదేశం ప్రభుత్వం  ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండి చెయ్యి చూపించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్చకులకు బాసటగా నిలిచారు. అర్చకుల వంశపారంపర్య అర్చకత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అర్చక చట్టం సవరణ జరిగితే, తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న అర్చకులు,వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

అర్చకులకు జీవం పోసిన జగన్‌ 
అర్చకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జీవో  జారీ చేశారు. త్వరలోనే ఈ జీవో అమలుకానుంది. ఈ సమస్యతోపాటు ఇతర సమస్యల సాధన కోసం అర్చక సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేశాయి. టీడీపీ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. జగన్‌ సీఎం కాగానే వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. వంశపారంపర్య హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు. 6బి,6సి దేవాలయాల్లో పనిచేసే ప్రతి అర్చకుడికి రూ. పదివేలు జీతం ఇవ్వాలని దేవదాయ అధికారులను సీఎం ఆదేశించారు. సంకల్పయాత్రలో, విశాఖలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జనలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకుటున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కు జీవో విడుదల చేయడంతో అర్చకులు సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు.
 
అర్చకులకు బాసటగా వైఎస్సార్‌ 
దివంగత వైఎస్సార్‌ అంటే అర్చకులకు ఎనలేని అభిమానం. అర్చకుల సమస్యలపై ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. 1987 నాటి అర్చక చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. వైఎస్సార్‌ మరణాననంతరం అర్చకుల వంశపారంపర్య హక్కులు, ఇతర సమస్యలు పరిష్కారం అలాగే ఉండిపోయాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ అర్చకుల బాధలను చూసి చలించిపోయారు. వంశపారంపర్య హక్కుల పునరుద్ధరణకు జీవో తెచ్చారు. పునాతన,శిథిలావస్థకు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం అమలుకు నిధులు కూడా కేటాయించారు. 

జిల్లాలో ఆలయాలు 
జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో మొత్తం 1047 ఆలయాలు ఉన్నాయి. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహాస్వామి, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం, ఆశీలమెట్ట శ్రీ సంపత్‌ వినాయకగర్‌ ఆలయాలు జిల్లాలో పెద్దవి. జిల్లాలో 6ఎ దేవాలయాలు 11  , 6బీ 60 ఆలయాలు, 6సి 972 ఆలయాలు ఉన్నాయి. వీటిలో వంశపారంపర్య హక్కులు ఉండే ఆలయాలు దాదాపు 35 నుంచి 40 వరకు ఉంటాయి.

సీఎంకు రుణపడి ఉంటాం 
దేవాదాయశాఖ ఇచ్చిన జీవోలను అమలు చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో జీవోలను పక్కన పెట్టారు. ఇప్పడు వంశపారంపర్య హక్కు జీవోను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అర్చకుల కోసం పని చేస్తున్న సీఎం జగన్‌కు అర్చక లోకం రుణపడి ఉంటుంది. వంశపారంపర్య హక్కు అమలు కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. కాని అమలు కాలేదు. ఇప్పుడు అమలు అవుతుండడంతో సంతోషంగా ఉంది.
– కొత్తలంక మురళీకృష్ణ, ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి  

సంతోషంగా ఉంది 
సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అర్చక లోకానికి మేలు చేసే పనులు చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అర్చకుల వంశపారంపర్య హక్కు జీవో జారీ చేశారు. అర్చక కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. గతంలో ఈ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. అయినా పట్టించుకోలేదు. కాని జగన్‌ వచ్చిన కొద్ది నెలలకే సమస్య పరిష్కరించారు. 
– వెలవలపల్లి కోటేశ్వర శర్మ, అర్చక సంఘం నాయకుడు

అర్చకుల కష్టాలను అర్థం చేసుకున్న జగన్‌ 
అర్చకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పాదయాత్రలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాం. మంచి రోజులు వస్తున్నాయి. అంతా మంచి జరుగుతుందని మాతో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఇంకా  కొన్ని ఆలయాల్లో అతి తక్కువగా జీతాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు కూడా లేవు. 6సి,6బి అర్చకులకు నెలకు రూ.20 వేల జీతం ఇవ్వాలని కోరుతున్నాం. 
– అయిలూరి శ్రీనివాస దీక్షితులు, ఉత్తరాంధ్ర అర్చక  సంఘం అధ్యక్షుడు

అర్హులందరికీ జీతం
జిల్లాలో 6సీకి సంబంధించిన ఆలయాల్లో 51 మంది అర్చకులకు నెలకు పది వేల రూపాయల జీతాలను అమలు చేశాం. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. వీరి కూడా రూ.10 వేలు జీతం ఇచ్చేందుకు ధార్మిక పరిషత్‌కు లేఖ రాశాం. దేవాలయం నుంచి కొంత భాగం, థార్మిక పరిషత్‌ నుంచి మొత్తం కలిపి ఈ జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. 
ఎ.శాంతి, సహాయ కమిషనర్, దేవాదాయశాఖ విశాఖ జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top