నిను కొలువగ వచ్చితి..

President Ramanath Kovind Visits Tirumala - Sakshi

తిరుమల శ్రీవారి దర్శనానికి భారత ప్రథమ పౌరుడు

రెండురోజుల పర్యటన నిమిత్తం తిరుమల చేరుకున్న వైనం

సాదరస్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు

సాక్షిప్రతినిధి, తిరుపతి: వీవీఐపీలతో తిరుపతి పురవీధులు శనివారం రద్దీగా మారాయి. భారత ప్రథమ పౌరుడు రామనాథ్‌ కోవింద్, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి దంపతులు శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ బసంత్‌కుమార్, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి, కపిలతీర్థం చేరుకుని శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదివరకు నీలం సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీ ముగ్గురు రాష్ట్రపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ జాబితాలో నాలుగో రాష్ట్రపతిగా రామనా«థ్‌ కోవింద్‌ చేరారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. 

రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత
రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు చేపట్టింది. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్సీలు, 22 మంది డీఎస్పీలు, 35 సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 200 మంది స్పెషల్‌ పోలీసులు, 3 కంపెనీల ఏపీఎస్‌పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మరో 475 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం 1,692 మందితో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 


రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి

గంట ముందే చేరుకున్న సీఎం 
రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటుండడంతో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మి«థున్‌రెడ్డి వచ్చారు. రేణిగుంటకు చేరుకున్న సీఎంకు డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, ఏ.శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతి రాణా టాటా, ఎస్పీలు అన్బురాజన్, వెంకట అప్పలనాయుడు, తిరుపతి నగర కమిషనర్‌ గిరీషా తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. 

రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రముఖులు
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఏ శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం తదితరులు స్వాగతం పలికారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top