కోలుకున్న ప్రత్యూష ఆపద వేళా చెదరని చిరునవ్వు

Prathyusha Recovered In GGH - Sakshi

సర్పవరం (కాకినాడసిటీ): ప్రమాదానికి గురైన ప్రత్యూష పూర్తిగా కోలుకుందని బుధవారం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైద్యులు తెలిపారు. ఇటీవల ప్రమాదశాత్తు మేడపై నుంచి పడిపోయిన ఈమె పక్కటెముకకు కర్ర గుచ్చుకుని కడుపులో నుంచి బయటకు వచ్చిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ నెల 10వ తేదీన ప్రమాదం జరిగిన అనంతరం రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్ళి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ పీవీ బుద్ధ, డాక్టర్‌ రజని, వైద్య బృందం కడుపులోనుంచి కర్రను తొలగించి శస్త్ర చికిత్స చేసిన అనంతరం పూర్తిగా కోలుకున్నందున బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.

ప్రమాదం పెద్దదే...అయినా భయపడలేదు..
నా పక్కటెముకల్లో కర్ర గుచ్చుకున్నా నేను ధైర్యంగానే ఉన్నాను. డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను మాలమస్తీ కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు నాకు భయం తెలియకుండా పెంచారు. నా కుటుంబంలో ఎవరికీ భయం ఉండదు. ఎంతటి సమస్యనైనా ఒంటరిగానే ఎదుర్కోవలసి ఉంటుందని, మా పెద్దల నుంచి నాకు అలవాటైంది. నా కడుపులో కర్ర దిగినా నా కళ్ళల్లో నీళ్ళు రాలేదు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో మాలమస్తీ విన్యాసాలకు ప్రత్యేకత ఉంది. నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మాలాంటివాళ్లను ప్రభుత్వం తరుపున జిమ్నాస్టిక్‌ పోటీలకు పంపిస్తే నిజాయితీగా పతకాలు తెస్తాం.
– పత్తి ప్రత్యూష, 8వ తరగతి, దుళ్ల హైస్కూల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top