ఏళ్లుగా ఏమార్చుతున్నారు..!

Prakasam Veligonda Project Delayed TDP Party - Sakshi

వెలిగొండపై బాబువన్నీ ఒట్టి మాటలే..

కాంట్రాక్టర్లను మార్చినా ప్రయోజనం శూన్యం

సీఎం ఇచ్చిన హామీలకే దిక్కులేదు

ఇటలీ నుంచి వచ్చిన బోరింగ్‌ మెషీన్ల పంపులు

రెండు వారాలుగా సొరంగాల తవ్వకం

మందకొడిగానే సాగుతున్న పనులు

అంతంత మాత్రంగానే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు

పజలను ఏమార్చుతూనే ఎన్నికలు పూర్తి చేసుకున్న చంద్రబాబు

ఒంగోలు సబర్బన్‌:  ప్రకాశం జిల్లా ప్రజల ఆశాదీపం, జీవధార అయిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకోవడం మినహా గడచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం సాధించేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ సంవత్సరాంతానికి పూర్తిచేస్తాం.. సంక్రాంతికి నీరిచ్చేస్తాం అంటూ ప్రకటనలు  చేసి జిల్లా ప్రజల్ని ఏమార్చుతూ వచ్చారు. కానీ, ఏ ఒక్క మాట నెరవేరలేదు.

బోరింగ్‌ యంత్రాలతో పనులకే బ్రేక్‌..
కొంతకాలంగా బోరింగ్‌ యంత్రాలు మరమ్మతులకు గురికావటంతో సొరంగాలను తొలిచే ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. కొండను తొలిచే మెషీన్లకు అనుసంధానం చేసే పంపుల కోసం కొన్ని నెలల క్రితం ఇటలీ నుంచి ఆర్డరు చేశారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో షిప్పుల ద్వారా నౌకాశ్రయాలకు చేరుకున్నాయి. అక్కడ నుంచి వాటిని వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు. మొత్తం ఆరు పంపులు తెప్పించిన కాంట్రాక్టర్లు వాటిలో రెండింటిని రెండు మెషీన్లకు బిగించారు. మరో నాలుగు పంపులను అందుబాటులో ఉంచారు. దీంతో దాదాపు 14 రోజుల నుంచి బోరింగ్‌ మెషీన్లు కొండను తొలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. రోజుకు ఒక్కో సొరంగం 10 నుంచి 15 మీటర్లు తవ్వాల్సి ఉంటే అందులో సగం కూడా తవ్వలేకపోతున్నాయి. సొరంగంలో ముడిరాయి పడటం వల్లనే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయన్నది జలవనరుల శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న మాట. రోజుకు మొదటి సొరంగంలో 5.5 నుంచి 6 మీటర్లు మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రెండో సొరంగంలో కేవలం 3 మీటర్లు మాత్రమే తవ్వకాలు చేస్తున్నారు.

కాంట్రాక్టర్లను మార్చి ఏం లాభం?
ప్రాజెక్టు పనులతో పాటు రెండు సొరంగాల తవ్వకం పనులు ముందుకు సాగటం లేదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లనే మార్చింది. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా పనులు మాత్రం ముందుకుసాగలేదు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇప్పించుకున్నా పనుల విషయంలో నత్తే నయం అన్న నానుడిగా తయారైంది. వందల, వేల కోట్లు ప్రజాధనం ఆవిరై పోతున్నా నిర్మాణ ఆశయం మాత్రం నెరవేర్చలేదని జిల్లా ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా చెప్పిన ఏ ఒక్క మాట కూడా నెరవేరలేదు. 2018 జూన్‌ కల్లా పూర్తి చేసి నీరు ఇస్తామని గతంలో చెప్పారు. ఆ తరువాత సంవత్సరం ఆఖరుకు అని ఘంటా పథంగా చెప్పి ప్రజలను ఏమార్చారు. 2018 సంవత్సరం మొదట్లో పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పటికీ అదే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన మాటకే దిక్కులేకపోతే ఇక ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో, అసలు ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా లేదా అన్న సందేహంలో జిల్లా ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్నారు. పాత కాంట్రాక్టర్లను తప్పించిన ప్రభుత్వ పెద్దలు వాళ్లకు అనుకూలమైన వారికి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మొదటి టన్నెల్‌ పనులను మేఘ కాంట్రాక్టర్లకు, రెండో టన్నెల్‌ పనులను రిత్విక్‌ కాంట్రాక్ట్‌ కంపెనీకి అప్పగించారు. చివరకు ఏళ్ళ తరబడి జిల్లా ప్రజలను ఏమార్చుతేనే ఎట్టకేలకు 2019 సాధారణ ఎన్నికలను కూడా పూర్తి చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కింది.

2022 కూడా కష్టమే..
వెలిగొండ రెండో టన్నెల్‌ పనులు రోజుకు కనీసం 4 మీటర్లు కూడా ముందుకు సాగటం లేదు. సరాసరిన 3 మీటర్లు మాత్రమే టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్లు తొలుస్తున్నాయి. వాస్తవానికి రోజుకు 10 నుంచి 15 మీటర్లు మేర రెండో టన్నెల్‌ను తొలచాల్సి ఉంది. ఈ విధంగా పనులు జరిగితే 2022 సంవత్సరానికి కూడా పనులు సాగవని నిపుణులు చెబుతున్నారు.
మొత్తం రెండో టన్నెల్‌ దాదాపు 19 కిలో మీటర్లు మేర సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 కిలో మీటర్ల మేర తవ్వారు. ఇంకా 8 కిలో మీటర్లు తవ్వాలి. ఇకపోతే మొదటి టన్నెల్‌ రోజుకు సరాసరిన 12 మీటర్లు తవ్వాలి. అయితే అదికాస్తా రోజుకు 5.5 నుంచి 6 మీటర్ల మేర మాత్రమే తవ్వగలుగుతున్నారు. ఇది మొత్తం 18.8 కిలో మీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉంది.  ఇంకా మొత్తం 3.5 కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది.

మొబలైజేషన్‌ కింద రూ. 84.2 కోట్లు
వెలిగొండ పనులు ముందుకు సాగటానికి అంటూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద రూ. 84.2 కోట్లు కూడా విడుదల చేసింది. విడుదల చేసి కూడా నెలలు గడుస్తోంది.
అయినా ఇటలీ నుంచి ఆరు పంపులను మాత్రమే తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా మెషీన్లకు సంబంధించిన విడిభాగాలు తెప్పించాల్సి ఉంది. మరి వాటిని ఎప్పటికి తెప్పిస్తారో వేచి చూడాలి. పనులు ముందుకు సాగటంలో ముఖ్యమంత్రి  మాటకే దిక్కు లేకుండా పోయింది. 2018 ఆఖరుకు పనులు పూర్తి చేసి జిల్లాతో పాటు వైఎస్సార్‌ కడప జిల్లా ప్రజలకు కూడా నీరిస్తానని చెప్పిన చంద్రబాబు మాట నీటి మూటగానే మిగిలిపోయింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలో కొల్లం వాగు వద్ద చేపట్టిన హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.

ముడిరాయి పడటంతో ఆలస్యం...
సొరంగాల్లో ముడి రాయి వస్తుండటంతో తవ్వకాలు ఆలస్యమవుతున్నాయి. వడివడిగా తవ్వటం వలన మెషీన్లు మరమ్మతులకు గురవుతాయన్న ఉద్దేశంతోనే నిదానంగా పనులు చేస్తున్నారు. ఒకవేళ పంపులు చెడిపోయి ఆటంకం ఏర్పడితే ఇంకా ఆలస్యమవుతుందేమోనని జాగ్రత్తగా పనులు చేపడుతున్నారు. మెషీన్లకు సంబంధించిన పంపులను అదనంగా అందుబాటులో ఉంచాం. కొల్లంవాగు వద్ద డిజైన్లు పూర్తయి వారం పది రోజుల్లో కాంక్రీటు పనులు ప్రారంభిస్తాం. ఒక సొరంగం 20 మీటర్లు, మరో సొరంగం 10 మీటర్లు తవ్వగలిగాం.– బి.సుధాకర్‌బాబు,జలవనరుల శాఖ జిల్లా చీఫ్‌ ఇంజనీరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top