వరద పోటెత్తడంతో తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు

Prakasam Barrage Opens All 70 Gates Lifted To Prevent Flooding - Sakshi

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

పునరావాస కేంద్రాలకు తరలుతున్న బాధితులు

హంసలదీవి సాగర సంగమం వద్ద సముద్ర పోటుతో ప్రజల ఆందోళన

ఇప్పటి వరకు 46.5 టీఎంసీల నీరు సముద్రం పాలు

ముంపునకు గురైన తోట్లవల్లూరు లంక గ్రామాలు

సాక్షి, విజయవాడ: కృష్ణవేణి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదీమతల్లి.. నీటి చెమ్మ దొరకగా అల్లాడిన మాగాణులను సస్యశ్యామలం చేస్తూ బిరబిరా సముద్రుడి చెంతకు పరుగులు పెడుతోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో బ్యారేజ్‌ 70 గేట్లు తొమ్మిదడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే తోట్లవల్లూరు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరోవైపు సాగర సంగమం వద్ద సముద్రపు పోటు ఉండటంతో హంసలదీవిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు.


నీట మునిగిన కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం పుష్కరఘాట్‌ శివాలయం 

కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం ఉదయం 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా రాత్రి అయ్యే సరికి 5 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. 

బ్యారేజ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం..
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచారు. ఆపై పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు 5.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే.. బ్యారేజ్‌ 70 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి 5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. రాత్రంగా ఇదే ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.  

46.5 టీఎంసీలు సముద్రంలోకి...
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 46.5 టీఎంసీ వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌ గుండా సముద్రంలోకి చేరాయి. గురువారం కూడా వరద నీటి ఉధృతి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరకట్ట దిగువన కృష్ణానది వైపు ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా తోట్లవల్లూరు మండలం పరిధిలోని పలు అరటి, బొప్పాయి తోటలు నీటిలో నానుతున్నాయి.

సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు..


ముంపునకు గురైన పాములలంకకు పడవలో వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

విజయవాడ కృష్ణలంక రణదీవె నగర్, భూపేష్‌నగర్‌ గుప్తా, తారాకరామానగర్, బాలాజీనగర్, రామలింగేశ్వరనగర్‌లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక్కడి నివాసులను అధికారులు  రాణిగారితోట, కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్, భ్రమరాంబపురంలో ఎస్‌వీ రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలంటూ మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు. పేదలు సురక్షిత ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి ఇళ్లలోని వస్తువులు దొంగల పాలు కాకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్‌ దిగువున ఉన్న తోట్లవల్లూరు ప్రాంతంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

దశాబ్దకాలం తర్వాత..
దశాబ్దకాలంగా కృష్ణానదికి వరద నీరు సరిగా రావడం లేదు. 2009లో 10.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు వదిలారు. ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వదలడం ఇదే తొలిసారి. ఏళ్లుగా సముద్రంలోకి వరద నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో సముద్రం గర్భంలో నుంచి ఉప్పునీరు తోసుకువస్తోంది. దీంతో బందరుతో  పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి చేరుతుండటంతో ఉప్పునీటి విస్తరణ తగ్గుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.


ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పరిస్థితి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top