అక్రమాలు జరిగితే ఏజెన్సీని మార్చేస్తాం

Pradyumna Clarification To Crop buying centers  - Sakshi

పంటల కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోకుండా చర్యలు 

మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రద్యుమ్న స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: పంటల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే సేకరణ ఏజెన్సీని మార్చేస్తామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రద్యుమ్న తేల్చిచెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మార్కెటింగ్‌ శాఖ అధికారులు, సేకరణ ఏజెన్సీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పత్తి, కందుల కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటిపై ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కందుల సేకరణ ఏజెన్సీ అయిన జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీని ఆ బాధ్యత నుంచి తప్పించామని చెప్పారు. అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్దతు ధరలు ప్రకటించిన 22 రకాల పంటలను 216 మార్కెట్‌ యార్డులు, 150 సబ్‌ యార్డుల్లో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. పంటల సేకరణ ఏజెన్సీలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. 

మార్గదర్శకాలు 
- రైతుల వారీగా యార్డుల్లోని ఇన్‌గేట్, ఔట్‌గేట్‌ల వద్ద పంటలను నమోదు చేయాలి. రైతుల నుంచే పంటలను సేకరించాలి. 
- సేకరణ కేంద్రానికి రైతులు తప్పనిసరిగా రావాలి. అలా రాకపోతే పంటను తీసుకోరు. 
- రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు పాస్‌పుస్తకం, కౌలుదారీ పత్రం, ఈ–క్రాప్‌ నమోదు వివరాలు తీసుకురావాలి. 
- ప్రభుత్వం సూచించిన పరిమాణానికి మించి పంటను రైతుల నుంచి ఏజెన్సీలు తీసుకోకూడదు.
- పంటల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలి.
మార్గదర్శకాలను ఉల్లంఘించిన కేంద్రాల్లో పంటల సేకరణను నిలిపివేసే అధికారం మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శికి ఉంటుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top