'పవర్' ఫుల్ డిమాండ్ | Power consumption in the state will increase | Sakshi
Sakshi News home page

'పవర్' ఫుల్ డిమాండ్

Jan 4 2020 4:50 AM | Updated on Jan 4 2020 4:50 AM

Power consumption in the state will increase - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరగబోతోంది. ఈ ఏడాది (2019–2020) విద్యుత్‌ డిమాండ్‌ 68 వేల మిలియన్‌ యూనిట్లుగా ఉంది. 2023–24కు ఇది దాదాపు లక్ష మిలియన్‌ యూనిట్లకు చేరుకోవచ్చని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) అంచనా వేశాయి. పగటిపూటే 9 గంటలు వ్యవసాయ విద్యుత్‌ అందించడం, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ఏటా పెంచాలని నిర్ణయించడం, వాణిజ్య, గృహ విద్యుత్‌ వినియోగం ఏటా 20 శాతం పైబడి పెరిగే అవకాశం ఉండటంతో ఐదేళ్లలో వినియోగం ఇప్పుడు ఉన్నదాని కంటే 32 వేల మిలియన్‌ యూనిట్లు అధికంగా ఉండొచ్చని లెక్కగట్టాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు అంచనాల (ఫోర్‌కాస్ట్‌)ను సమర్పించాయి. 

అందుబాటులోకి  కొత్త ప్లాంట్లు
కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మాణ దశలో ఉన్న 1600 మెగావాట్ల (ఒక్కొక్కటి 800 మెగావాట్లు) థర్మల్‌ ప్లాంట్లు 2020లో అందుబాటులోకి వస్తాయి. 2021 నాటికి పోలవరం జల విద్యుత్‌ కేంద్రాల్లో కొంత ఉత్పత్తిలోకి రావచ్చని భావిస్తున్నారు. అప్పర్‌ సీలేరులో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో జల విద్యుత్‌ కేంద్రం ప్రతిపాదన దశలో ఉంది. మరో రెండేళ్లలో ఇది పూర్తి అవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా రాష్ట్రంలో న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ విద్యుత్‌ కోసం 10 వేల మెగావాట్లతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. ఈ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ రంగంలో జెన్‌కో కీలక భూమిక పోషించే వీలుంది. ఫలితంగా వినియోగదారులకు చౌకగా విద్యుత్‌ లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఏపీ జెన్‌కో స్పీడ్‌..
విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించేందుకు ఏపీ జెన్‌కో సన్నద్ధమవుతోంది. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లు చౌకగా లభించే ఏపీ జెన్‌కో ఉత్పత్తిని పెంచాలని, ఇదే క్రమంలో ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం (2019–20)లో జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 4621.75 మెగావాట్లుగా ఉంది. 2023–24 నాటికి దీన్ని 6117.75 మెగావాట్లకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదేవిధంగా జల విద్యుత్‌ను ప్రస్తుతమున్న 1755.86 మెగావాట్ల నుంచి 2023–24లో  2706.26 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకెళ్తారు. బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్‌ లభించినప్పుడు జెన్‌కో థర్మల్‌ ఉత్పత్తికి విరామం ఇవ్వాలని, మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు జెన్‌కో ఉత్పత్తిని వాడుకోవాలని ప్రణాళికలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement