
బిడ్డను బతికించలేక.. విషమిచ్చారు!
పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక తల్లిదండ్రులు పాలలో విషం కలిపి ఆ బిడ్డ ప్రాణం తీశారు.
పురుగులమందు తాగి తామూ ఆత్మహత్య
చిత్తూరులో కుటుంబం విషాదం
సాక్షి, చిత్తూరు: పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక తల్లిదండ్రులు పాలలో విషం కలిపి ఆ బిడ్డ ప్రాణం తీశారు. కడుపు కోత భరించలేక తామూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం చిత్తూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని గిరింపేట గాంధీనగర్‌కు చెందిన ఈశ్వరరావు (31) రవాణా శాఖలో హోం గార్డు. అతని భార్య రజని (24). వీరికి ఐదు నెలలక్రితం కొడుకు రిత్విక్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారి నిమోనియాతో బాధపడుతున్నాడు.
చిత్తూరు, వేలూరు, తిరుపతిలోని ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. మెరుగైన చికిత్స చేయించే స్థోమతలేదు. దీంతో మనో ధైర్యాన్ని కోల్పోయిన దంపతులు బిడ్డను బతికించుకోలేమని నిర్ధారణకు వచ్చారు. సోమవారం ఉదయం ఇంట్లోనే పాలలో విషం కలిపి బిడ్డకు తాగించారు. అనంతరం బిడ్డలేని బతుకు మాకెందుకని వారు కూడా పురుగుల మందు తాగారు. రిత్విక్ ఇంట్లోనే చనిపోగా, రజని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. కాగా సోమవారం రాత్రి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈశ్వరరావు భార్య రజని ప్రస్తుతం 3 నెలల గర్భవతి అనీ, ఆమె గర్భంలో మగ బిడ్డ ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం వారికి ముందే తెలిసి ఉంటే ఇలా బలవన్మరణానికి పాల్పడి ఉండేవారు కాదేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.