
సాక్షి, అమరావతి : ఎన్నికల వేళ జరుగుతున్న పోలీసు బదిలీలపై ఎన్ని విమర్శలు వస్తున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారలేదు. రాజకీయ కోణంలోనే తాజాగా గురువారం జరిగిన ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ ఉత్తర్వులు సైతం కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా రెండు జిల్లాల ఎస్పీల బదిలీ పోలీసు శాఖలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ బదిలీల్లోను సామాజిక కోణం చొరబడటంతో విమర్శలకు తావిస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న బూసారపు సత్య ఏసుబాబును విశాఖపట్నం గ్రేహౌండ్స్ కమాండర్‌గా బదిలీ చేయడం గమనార్హం. గతంలో కడప ఓఎస్‌డీ(ఆపరేçషన్స్) నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన ట్రాన్సఫర్ అయ్యారు. ముక్కుసూటిగా వ్యవహరించే సత్యఏసుబాబు ప్రకాశం జిల్లాలోని సీఎం సామాజికవర్గం పెద్దలకు మింగుడు పడలేదు. దీంతో ఎన్నికల సమయంలో అతను ఉంటే పార్టీకి ఇబ్బంది అనే కారణంతో చంద్రబాబుపై వత్తిడి తెచ్చి సత్య ఏసుబాబును గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయించారు. కాపు సామాజికవర్గానికి చెందిన సత్య ఏసుబాబును బదిలీ చేయించి సొంత సామాజికవర్గానికి చెందిన, కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్ కోసం పావులు కదిపారు.
ఈ నేపథ్యంలోనే కోయ ప్రవీణ్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావుకు కోయ ప్రవీణ్ దగ్గర బంధువు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతి బదిలీ కూడా రాజకీయకోణంలోనే జరిగిందనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం సీఎం సమక్షంలో జరిగిన కడప టీడీపీ పంచాయితీలో ఎంపీగా పోటీకి మంత్రి ఆదినారాయణరెడ్డి అంగీకరించిన సంగతి తెల్సిందే. ఇదే సమయంలో కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి బదిలీకి కూడా మంత్రి ఆది పట్టుబట్టినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముక్కుసూటిగా వ్యవహరించే అభిషేక్ మహంతి ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన్ను బదిలీ చేయించి తమకు సానుకూలంగా ఉండే వాళ్లను తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ మహంతిని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేసి కడప జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మను నియమించారు. వినిత్ బ్రింజ్‌లాల్‌ను గ్రేహౌండ్స్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. గ్రోవెల్ నవదీప్‌సింగ్‌ను గ్రేహౌండ్స్ నుంచి విజయవాడ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
ఐఏఎస్‌లకు బదిలీ, పోస్టింగ్‌లు
పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ మరి కొంతమంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి. రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను ప్రస్తుతం వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిమితం చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్‌ను పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. గనులు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్ శ్రీ నరేష్‌కు తిరిగి చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, జౌళి శాఖ కార్యదర్శి డాక్టర్ పి. లక్ష్మీనర్సింహను సాధారణ పరిపాలన(సర్వీసెస్) కార్యదర్శిగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న కె. మాధవీలతను ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ ఎం. విజయ సునీతను పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న జి.సి. కిషోర్‌కుమార్‌ను వికలాంగులు, వయో వృద్ధుల శాఖ సంచాలకులుగా నియమించారు. కృష్ణా జిల్లా డీఆర్‌వోగా పనిచేస్తున్న లావణ్య వేణిని సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న పి. శ్రీనివాసులును విశాఖ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. విశాఖ జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న కె. విజయను పర్యాటక, సాంస్కృతిక శాఖ సీఈవోగా నియమించారు. ప్రస్తుతం కె. విజయ నిర్వహిస్తున్న ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ బాధ్యతలను కె.ధనుంజయరెడ్డికి అప్పగించారు.