విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్లో అనిశ్చితి ఏర్పడిందని మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గండుగులపల్లి(దమ్మపేట), న్యూస్‌లైన్: విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్లో అనిశ్చితి ఏర్పడిందని మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గండుగులపల్లిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, విభజన జరిగినా ఇరు ప్రాంతాల్లో తాము బలమైన శక్తిగా ఉంటామని అన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఒక విధంగా, కాంగ్రెస్‌లో విలీనమైతే మరొక విధంగా రాజకీయాలు మారే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో లోపాలు, అవినీతి ప్రభావం ఇరు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ నామమాత్ర మేనని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నుంచి నాయకత్వం ఇతర పార్టీల ైవె పు వెళ్లినా తమకొచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో శత్రువులు సహజమని, ప్రతిపక్ష పార్టీల్లోని శత్రువులను ఎదుర్కోవడం కష్టం కాదని, పార్టీలో ఉంటూ పతనం కోరుకునే వారిని ఎదుర్కొవడమే కష్టమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, జనం మధ్యలో ఉండే వారు కొన్ని సందర్భాల్లో ఓటమిపాలైనా నిరుత్సాహపడకూడదని అన్నారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరని, తప్పుడు నిర్ణయం తీసుకోరని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడానికి యువత ఉత్సాహం చూపుతున్నారని, అందులో భాగంగానే కార్పొరేట్ ఉద్యోగి కందిమళ్ల కుమారనాగప్రసాద్ ఇటీవల తమ పార్టీలో చేరారని తెలిపారు. రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కావని, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చన్నారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దొడ్డాకుల రాజేశ్వరరావు, మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, నాయకులు దొడ్డా ప్రసాద్, అబ్ధుల్ జిన్నా, పానుగంటి రాంబాబు, వలీ పాష, కాసాని నాగప్రసాద్ లు పాల్గొన్నారు.