తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా... ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో మరుగునపడిన రెండు పాత హత్య కేసులు వెలుగుచూశాయి.
గట్టు/గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా... ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో మరుగునపడిన రెండు పాత హత్య కేసులు వెలుగుచూశాయి. గత నెల 20న గట్టు మండలం ఆలూరుకు చెందిన రైతు కుర్వ గుడిసె తిమ్మప్ప(48) తుమ్మలచెరువు గ్రామ శివారులో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను విచారిస్తుండగా ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
దాదాపు 11 ఏళ్ల క్రితం ఆలూరుకు చెందిన కుమ్మరి కిష్టయ్య (20), కర్నూలుకు చెందిన మరో వ్యక్తిని హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఆలూరు గుట్టల్లో 11 ఏళ్ల క్రితం హత్యకు గురైన కమ్మరి కిష్టయ్య ఆస్థికలను శుక్రవారం ఆలూరు పునరావాస కేంద్రానికి సమీపంలో గద్వాల డీఎస్సీ గోవిందరెడ్డి, సీఐ షాకీర్‌హుస్సేన్, పోలీసు సిబ్బంది గుర్తించారు. శుక్రవారం డీఎస్పీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
హత్యలు చేసింది ఇలా...
గుడిసె తిమ్మప్ప(48)హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఆలూరుకు చెందిన బోయ వెంకట్రాములు, వెంకటన్న, ఆంజనేయులు, అలంపూర్‌కు చెందిన కోనేరు జగన్‌లను గురువారం సాయంత్రం బల్గెర చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే గుడిసె తిమ్మప్పను వేట కొడవళ్లతో చంపి, వాగులో పూడ్చి వేశామని వారు అంగీకరించారు. తన సమీప బంధువుల పొలాన్ని తిమ్మప్ప కొనుగోలు చేశాడని, ఇది సహించలేకే తనతో పాటు ముగ్గురు కలిసి హత్య చేశామని వెంకట్రాములు తెలిపాడు. దీంతో పాటు 11 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సంబందించిన వివరాలను కూడా వెల్లడించాడు. 2003 జనవరిలో గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య దారుణహత్యకు గురయ్యాడు. కుమ్మరి కిష్టయ్య చెల్లెలితో వెంకట్రాములుకు వివాహేతర సంబంధం ఉండేంది. ఈ విషయం కిష్టయ్యకు తెలియడంతో అతడిని హత మార్చాలని వెంకట్రాములు నిర్ణయించుకున్నాడు.
ఈ నేపత్యంలో వెంకటన్న, రాఘవేంద్ర , కర్నూలుకు చెందిన పరమేష్ సహాయంతో గ్రామ శివారులో కిష్టయ్య గొంతు నులిమి హత్యచేసి, గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని గుట్టపై ఉన్న సొరంగంలో పారవేశారు. ఈ విషయం బయటికి రాకపోవడంతో పోలీసులు కిష్టయ్య కేసును అదృశ్యంగా నమో దు చేశారు. కాగా కిష్టయ్యను హత్య చేసినందుకు పరమేష్ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే వెంకట్రాములు అతనికి రూ.40 వేలు ఇచ్చినా, అది సరిపోదని మిగిలిన డబ్బు ఇవ్వాల్సిందేనని తరుచూ బెదిరింపులకు దిగడం తో అతడిని హతమార్చేందుకు వెంకట్రాములు బృందం నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా ఆరు నెలల తర్వాత పరమేశ్‌ను గ్రామానికి రప్పించుకుని పీకలదాకా మద్యం తాగించి బండరాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహాన్ని తుమ్మలచెరువు శివారులోని వ్యవసాయ బావిలో పడేశారు. రెం డు రోజుల తర్వాత మృతదేహం తేలినా ఎవరూ గుర్తించలేకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసునమోదు చేశారు. అయితే తాజాగా ఈ హత్యను కూడా తామే చేసినట్లు నిందితులు అం గీకరించడంతో 11 ఏళ్లుగా మిస్టరీగా మారి న హత్యల చిక్కుముడి వీడింది. కాగా మరో నిందితుడు రాఘవేం ద్ర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.