పక్కదారి పడుతున్న పోలీసుల దర్యాప్తు !

Police Officers Supporting Sri Chaitanya Management And Neglecting Drugs Case In Mangalagiri - Sakshi

సాక్షి, మంగళగిరి : పట్టణంలోని  టిప్పర్ల బజార్‌లో గల శ్రీ చైతన్య కళాశాలలో ఈనెల 1న విద్యార్థులకు, లెక్చరర్లకు జరిగిన వివాదంలో పోలీసులు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, గంజాయి తీసుకున్నారనే సమాచారం మేరకు కళాశాలలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఐదుగురుని  అదుపులోకి తీసుకుని వారి రక్త నమూనాలను సేకరించారు. కళాశాలలో ఇంటర్‌ విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారంటే యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు. అసలు కళాశాలకు మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా విద్యార్థులు, తల్లితండ్రులును అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం విమర్శలకు తావిస్తోంది. శ్రీ చైతన్య కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్‌ తమను హింసిస్తున్నారని అదే రోజు విద్యార్థులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే లెక్చరర్‌ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఒక విద్యార్థి తల్లితండ్రులతో పాటు మరో ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం విశేషం. 

చర్చనీయాంశంగా మారిన అరెస్టులు 
కళాశాలలో చదివే విద్యార్థి మత్తు పదార్థాలకు బానిస అవడంతో పాటు తోటి విద్యార్థుల్ని బానిసలుగా మార్చడంతో పాటు తనపై హత్యాయత్నం చేశాడని, దీనికి విద్యార్థి తల్లితండ్రులు సహకరించారని లెక్చరర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 9న పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అసలు కళాశాలకు మత్తు పదార్థాల సరఫరా ఎలా జరిగింది? లెక్చరర్‌ను హత్య చేసే అవసరం విద్యార్థికి ఎందుకొచ్చింది? అనేది పట్టించుకోకుండా మైనర్‌ విద్యార్థులను జైలుకు పంపడం చర్చనీయాంశంగా మారింది.

శ్రీ చైతన్య యాజమాన్యం ఒత్తిడికి లొంగి పోలీసులు విద్యార్థులు, తల్లిదండ్రులను జైలుకు పంపారనే చర్చ జరుగుతోంది. కళాశాల యాజమాన్యం తమను వేధిస్తోందని, లెక్చరర్‌ మరీ వేధింపులకు గురి చేస్తున్న కారణంగానే తట్టుకోలేక తిరగబడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు మైనర్లు ఉండటం విశేషం. విద్యార్థులు తప్పు చేసి ఉంటే వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి మంచి దారిలో నడిచేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఇవేవి కాకుండా ఏకపక్షంగా విద్యార్థులు, తల్లితండ్రుల్ని పోలీసులు జైలుకు పంపి కళాశాల యాజమాన్యానికి సహకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యాజమాన్యానికి సహకరిస్తున్న పోలీసులు ? 
శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో ఏమి జరిగినా, అక్కడే పని చేసే నిర్వాహకులు విద్యార్థుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదు. చివరికి విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందన లేదు. పోలీసు యంత్రాంగం ఆయా కళాశాలల యాజమాన్యాలకు సహకరిస్తున్న కారణంగానే విద్యార్థులు గానీ తల్లిదండ్రులు గానీ అక్రమాలను ప్రశ్నించలేకపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన విద్యార్థులతో పాటు తల్లితండ్రులను జైలుకు పంపిన పోలీసులు.. అసలు కళాశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల సరఫరాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణమైన కళాశాలలు, యూనివర్సిటీల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలలపై చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top