
పరిశీలిస్తున్న డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ శ్రీనివాసరావు
శ్రీకాకుళం ,భామిని: ఆంధ్రా–ఒడిశా బోర్డర్(ఏఓబీ)లో పోలీస్‌ల కూంబింగ్ ముమ్మరమయింది. గత కొన్నాళ్లుగా స్తబ్ధతగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అరకులో మావోయిస్టుల ఘాతుకంతో పోలీస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చడంతో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో నిలిపివేసిన సాయుధ పోలీస్ కూంబింగ్‌లు తిరిగి ఆరంభమయ్యాయి. ఏఓబీలో కీలకమైన తివ్వకొండల్లో పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. భామిని మండలం నుంచి ఒడిశా, విజయనగరం జిల్లాలకు విస్తరించిన తివ్వకొండలు, అటవీ ప్రాంతంలో సోమవారం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు.
డీఎస్పీ స్వరూపారాణి సందర్శన
తివ్వకొండల్లో జరుగుతున్న పోలీస్ కూంబింగ్‌ను పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావుతో కలిసి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న కూంబింగ్‌ను పరిశీలించారు. సాయంత్రం సాయుధ బలగాలతో కలిసి భామిని మండలం మనుమకొండ–పాలవలస గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. పాలవలస సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహించారు. ఏబీ రోడ్లు వెంబడి పోలీస్‌లు తనిఖీలు చేశారు.