నాడు పోలీస్‌.. నేడు దొంగ

Police constable turned thief arrested in Pendurthi - Sakshi

పెందుర్తిలో ఘరానా దొంగ అరెస్ట్‌

సాక్షి, పెందుర్తి: అతడు ఒకప్పడు పోలీస్‌. దురాశ, వ్యసనాల కారణంగా నేడు అతడు కరుడుగట్టిన గజదొంగ. అనేక దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న అతడిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 442 గ్రాముల బంగారు ఆభరణాలు, 812 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీ ఫాల్గుణరావు వివరాలు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన అన్నాబత్తుల సత్యశ్రీనివాసరావు అలియాస్‌ అద్దాల శ్రీను 1998లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. పోలీస్‌గా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తితో రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌ వ్యాపారం ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో 2015 నుంచి దొంగతనాల బాట పట్టాడు. అదే సమయంలో పోలీస్‌ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఈ క్రమంలో రాజమండ్రికి చెందిన మరో దొంగ రవిచంద్రతో శ్రీనివాసరావుకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ విశాఖ వచ్చి దొంగతనాలు చేసేవారు. ఉదయం రెక్కీ నిర్వహించి మధ్యాహ్నం ఇళ్లను దోచేసేవారు. అలాగే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలు చాకచక్యంగా తెంపుకుపోయేవారు.

వీరిపై పెందుర్తి, పోతినమల్లయ్యపాలెం, గాజువాక, దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లలో 9 కేసులు నమోదయ్యాయి. వీరిపై నిఘాపెట్టిన పోలీసులు ఈ నెల 14న కృష్ణరాయపురంలో రవిచంద్రను అరెస్ట్‌ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో నారాయణపురంలో ఉన్న సత్యశ్రీనివాసరావును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన వెస్ట్‌జోన్‌ క్రైం సీఐ పి.సూర్యనారాయణ, పెందుర్తి క్రైం బ్రాంచ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జి.డి బాబు, కానిస్టేబుళ్లు కె.నరసింగరావు, ఎస్‌.దేముడునాయుడు, ఆర్‌.సంతోష్‌కుమార్‌లను ఏసీపీ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top