పోలీసుల జులుం

Police Attacks On YSRCP Activists IN YSR Kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను చితకబాదిన పోలీసులు

రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌ వద్ద  ధర్నా చేపట్టిన ఎమ్మెల్యే రాచమల్లు

పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

వైఎస్‌ఆర్‌ జిల్లా , రాజుపాళెం : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. గత నెల 28వ తేదీన జరిగిన చిన్న తగాదా విషయానికి సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను శుక్ర వారం పోలీసులు చితకబాదారు.  టీడీపీకి కొమ్ముకాస్తున్న పోలీసుల వైఖరికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధర్నా చేశారు. తమపార్టీ కార్యకర్తలను బట్టలు ఊడదీసి కొట్టినందుకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో చిన్న  తగాదాలను బూచిగా చూపి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వారిపై పెద్ద కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజుపాళెం మండలం అయ్యవారిపల్లెలో ఇంటి వద్ద జరిగిన చిన్న తగాదాను పెద్దగా చేసి టీడీపీ కొమ్ముగాస్తున్న పోలీసులు తమ పార్టీ  కార్యకర్తలను  బూతులు తిడుతూ కొట్టడంపై ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరేమైనా పెద్ద నేరగాళ్ల అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసినా ఇప్పటికీ ఆవ్యక్తిని పోలీసులు కొట్టలేదని.. ఇక్కడ చిన్న తగాదాలో తమ పార్టీ కార్యకర్తలను కొట్టడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు.   వినా యక  నిమజ్జనం రోజున పండుగ చేసుకోకుండా తమ పార్టీ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారన్నారు.    గొడవ పడి స్టేషన్‌కు వచ్చినప్పుడు ఇరువురి వాదనలు విని, ఎవరి తప్పు ఉంటే వారిపై కేసు నమోదు చేయాలన్నారు. కేవలం వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసుకొని పెద్ద కేసులు ఎలా బనాయిస్తారని ప్రశ్నించారు..

కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయాలి...
పోలీస్‌స్టేషన్‌లో ధర్నా అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. అయ్యవారిపల్లెలో జరిగిన చిన్న తగాదాను పెద్దదిగా చేసి పోలీసులు గంగా ధర్, మధు తమ కార్యకర్తలను  కొట్టినందుకు పోలీసు  ఉన్నతాధికారులు విచారణ చేసి ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.  ఆ ఇద్దరు పోలీసులు మద్యం దుకాణాల వద్ద, మట్కా బీటర్ల వద్ద, పేకాట రాయుళ్లు, సివిల్‌ పంచాయితీలు చేసి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.   ఇలాంటివారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పోలీసులను సస్పెండ్‌ చేయకపోయినా, తమ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయకపోయినా పోలీస్‌స్టేషన్‌లో నిరాహారదీక్ష చేస్తానన్నారు.  కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, వెలవలి అన్నపురెడ్డి రాజశేఖరరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, జిల్లా జాయింట్‌ సెక్రటరీ నూకనబోయిన రవీంద్ర, ఎంపీటీసీ సభ్యుడు రమణారెడ్డి, పోలా వెంకటరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ అన్నపురెడ్డి అరుణ్‌కుమార్‌రెడ్డి, కానాల బలరామిరెడ్డి, ధనిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం..  
అయ్యవారిపల్లెలో జరిగిన ఘర్షణపై సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. చట్టం ఎవరికైనా ఒకటేనని, అన్యాయం చేసిన వారిని వదలమని చెప్పారు. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top