పోలవరం ముంపు ప్రాంతాల కింద సీమాంధ్రలో కలిసే మన జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ప్రజలు ఓటుహక్కు ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై స్పష్టత వచ్చింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలవరం ముంపు ప్రాంతాల కింద సీమాంధ్రలో కలిసే మన జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ప్రజలు ఓటుహక్కు ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై స్పష్టత వచ్చింది. ముంపు కింద సీమాంధ్రలో కలిపినా ఆ ఓటర్లు తెలంగాణ పరిధిలోనే ఈసారి ఎన్నికలలో ఓటు వేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ప్రచురించిన భారత ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు.
ఈ గెజిట్ ప్రకారం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలు యథాతథంగా కొనసాగుతాయి. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విభజించి నియోజకవర్గాలను పేర్కొనగా, జిల్లాలోని 46 మండలాల పేర్లు తెలంగాణలోని నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన మేరకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ స్థానాలను యథాతథంగా ఉంచారు. అంటే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ముంపు మండలాల ఓటర్లు తెలంగాణలోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనితో పాటు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆరునెలల్లో పూర్తి చేయాలని చట్టంలో పేర్కొన్నారు.
ఎవరు పట్టించుకోవాలి...
రాష్ట్ర విభజన బిల్లు గెజిట్ అయిన నేపథ్యంలో త్వరలోనే అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడనుంది. ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఉండగా, జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 208 గ్రామాలు (సాగునీటి శాఖ 2005లో ఇచ్చిన జీవో నం.111 ప్రకారం 205 గ్రామాలతో పాటు బూర్గంపాడు మండలంలోని సీతారాంనగరం, కండ్రెక గ్రామాలు) జిల్లా నుంచి మినహాయించారు. బూర్గంపాడుపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోలవరం ముంపు కింద ఉన్న గ్రామాలు సీమాంధ్రలో కలిస్తే... ఓట్లు తెలంగాణలో వేయించడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రేపు రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఓట్లేసిన వారి ప్రయోజనాలను కాపాడేందుకు సీమాంధ్ర ప్రాంతానికి ప్రజాప్రతినిధులు పనిచేస్తారా అన్నది ప్రశ్నార్థకమే.