గ్రామాల్లో మౌలిక వసతులు ‘పది’లం

Planning of Rural Development Department for Infrastructure in villages - Sakshi

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.10 కోట్లు 

గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక

రూ.600 కోట్లతో కాంక్రీట్‌ మురికి కాలువలు

రూ.1,000 కోట్లతో సచివాలయ భవనాలు

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నంత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ దృష్టి సారించింది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగిలిన ఐదు నెలల కాలంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రూ.10 కోట్లకు తక్కువ కాకుండా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లించే వేతనాలతో నిమిత్తం లేకుండా మెటీరియల్‌ నిధుల కేటగిరీలో రూ.2,000 కోట్లు.. స్వచ్ఛ భారత్‌ పథకంలో మరో రూ.600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంది. ఈ నిధులతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.10 కోట్లకు తగ్గకుండా కొత్తగా అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకొని, వేగంగా పనులు ప్రారంభించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇప్పటికే జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకే... 
ఉపాధి హామీ పథకంలో, ఆయా శాఖల్లో గత ప్రభుత్వంలో అనుమతి తీసుకున్న పనులకు ఈ నిధులను ఉపయోగించకుండా.. గ్రామాల్లో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చేపట్టే కొత్త పనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు 13 జిల్లాల పరిధిలో 2,903 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కాంక్రీట్‌ మురుగు కాల్వల నిర్మాణానికి ఆయా జిల్లాల నుంచి పలు ప్రతిపాదనలు అందినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.  

కాంక్రీట్‌ మురుగు కాల్వలు, సచివాలయ భవనాలకు ప్రాధాన్యత 
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా.. కాంక్రీట్‌ మురుగు కాల్వల నిర్మాణం, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి పనుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కనీసం 3 వేల కిలోమీటర్ల పొడవునా కాంక్రీట్‌ మురుగు కాల్వల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ పంచాయతీ కార్యాలయం లేని చోట్ల రూ.35 లక్షలతో సచివాలయ కార్యాలయం నిర్మించాలని.. ఏదో ఒక భవనం ఉన్న చోట సచివాలయ అవసరాలకు తగ్గట్టు అదనపు భవన నిర్మాణానికి రూ.12–15 లక్షల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఐదు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు దాకా ఖర్చు చేయాలని ప్రణాళికగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఉండే స్కూళ్ల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి వాటికి రూ.100 కోట్లు, అటవీ, గృహ నిర్మాణ శాఖల ద్వారా రూ.100 కోట్ల చొప్పున మరో రూ.200 కోట్లు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మిగిలిన శాఖల ద్వారా మరో రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top