కన్ను పడితే.. స్థలం ఖతం! 

Persons Disputed Lands Places And Property With Theft Documents In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లా కేంద్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఖాళీ స్థలాల కబ్జా వెనుక సాంకేతిక పరంగా అనుభవమున్న ఒక ముఠా పని చేస్తోంది. ఈ ముఠా ప్రతి నెలా రెండు, మూడు అక్రమ రిజిస్ట్రేషన్లను చేయించుకుని రూ.కోట్లకు పడగలెత్తుతోంది. ముఖ్యంగా కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ముఠా ఆగడాలు పెచ్చుమీరాయి. నేరచరిత్ర కల్గిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూములు, స్థలాలు, అమాయకుల ఆస్తులను గుర్తించి దొంగ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

వీరికి రిజిస్ట్రేషన్‌ అధికారుల అండదండలు కూడా ఉండడంతో వారి పని సాఫీగా సాగిపోతోంది. కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కర్నూలు, కల్లూరు మండలాల్లో భూములు, స్థలాల విలువ అమాంతం పెరుగుతోంది. ఏ ప్రాంతంలో చూసినా సెంటు స్థలం నాలుగైదు లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ముఠా సభ్యులు ఐదారేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థలాలను గుర్తించి, వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కర్నూలు, కల్లూరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో ప్రతి నెలా ఒకట్రెండు అక్రమ రిజిస్ట్రేషన్‌ బాగోతాలు బయటకు వస్తున్నాయి.   

రిజిస్ట్రేషన్‌ అధికారుల ఉదాసీనత 
దొంగ రిజిస్ట్రేషన్లను నివారించడంలో ఆ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపు డ్యూటీ కడితే దేన్నైనా రిజిస్ట్రేషన్‌ చేస్తామన్న ధోరణిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో లింకు డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సక్రమంగా పరిశీలిస్తే నకిలీల బాగోతాన్ని పసిగట్టవచ్చు. అయినా ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. అక్రమార్కులతో మిలాఖత్‌ కావడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఒరిజనల్‌ డాక్యుమెంట్లను చూపిస్తూ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే... కోర్టులో తేల్చుకోవాలంటూ బాధితులకు ఉచిత సలహా ఇస్తున్నారు. 2000 సంవత్సరంలో నగరంలోని సంతోష్‌నగర్‌ పరిధిలోని షాహరాన్‌ నగర్‌లో  20 మంది ఇంటి స్థలాలను కొందరు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అలాగే 2008లో నగరంలోని రామ్‌ప్రియానగర్‌లో సర్వే నంబర్‌ 686/1లో వేసిన వెంచర్‌లో కొందరు దొంగ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లను చేయించుకున్నారు. ఇవి దొంగ రిజిస్ట్రేషన్లేనని ఆ శాఖ అధికారులు నిర్ధారించుకున్నప్పటికీ వాటిని రద్దు చేయకుండా కోర్టుకు పంపారు. దీంతో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు బేరసారాలకు రావాలని బాధితులను పిలుస్తున్నారు. వాళ్లు అనుకున్నట్లు వస్తే స్థలం విలువలో 30–40 శాతం తమకు చెల్లించాలని అడుగుతున్నారు. వినకపోతే బెదిరింపులకు సైతం దిగుతున్నారు. కొందరు వివాదం ఎందుకని పంచాయితీ చేసుకుంటున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top