వచ్చాడయ్యో సామీ. . ఇచ్చాడయ్యా హామీ

 People's Hopeful To YS Jagan Navaratnalu Scheme - Sakshi

రోగులకు దగ్గర్లోనే డయాలసిస్‌ సెంటర్‌

కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్‌ సెంటర్‌

నెలకు రూ.10 వేలు పింఛన్‌

జగన్‌మోహన్‌ రెడ్డి భరోసాతో కిడ్నీ రోగుల్లో మనోస్థైర్యం

అనారోగ్యంతో..ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పని చేయకపోతే  మందులు కూడా ఖరీదు చేసుకోలేని పరిస్థితి వారిది. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని దుస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి. నాయకులు వస్తున్నారు. పోతున్నారు. ఇన్నాళ్లూ ఈ దీనుల ఆవేదనను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎవరో వస్తారని..ఏదో చేసి ఆదుకుంటారని అలసిసొలసి బతుకులీడుస్తున్న ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తుల వెతలు చూసి చలించిపోయారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిపై రీసెర్చ్‌ సెంటర్‌ను,  రోగులకు దగ్గరలోనే డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి రోగికి మందుల నిమిత్తం నెలకు రూ.10 వేలు పింఛన్‌ అందజేస్తామని హామీ ఇచ్చి వారికి ధైర్యం కల్పించారు.   

సాక్షి, వజ్రపుకొత్తూరు: జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉద్దానంలో బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికపోవడం ఓ ఎత్తైతే.. ఆయా ప్రాంతాల్లో నిత్యం  కిడ్నీ మహమ్మారి కారణంగా చావు డప్పు మోగుతోంది. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ చేసుకునే రోగులకు కనీసం ఉచిత మందులు కూడా  అందడం లేదు. టీడీపీ పాలనలో ఆరోగ్య శ్రీ పథకాన్ని సవాలక్ష కత్తిరింపుల నడుమ ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవగా పేరు మార్చారు.  డయాలసిస్‌ రోగుల ఆర్థిక బాధలను టీడీపీ ప్రభుత్వం గట్టెక్కించే ప్రయత్నం ఏదీ చేయలేదు. జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లో దాదాపు 16 వేల మందికి పైగా కిడ్నీరోగులు ఉండగా అందులో మందస మండలం లోహరిబందలో దాదాపు 1500 మంది వరకు ఉన్నారు.

డయాలసిస్‌ చేసుకుంటున్న కిడ్నీ బాధితులు జిల్లాలో దాదాపు 4,260 మంది వరకు ఉంటే  ఇప్పటి వరకు 1,400 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేసుకుంటున్నారు. వారిలో కేవలం 370 మందికి మాత్రమే ముష్టి వేసినట్లు రూ.2,500 పింఛన్‌ను టీడీపీ ప్రభుత్వం ఇస్తోంది. నెలకు రూ.7వేల వరకు ఖర్చయ్యే రోగులకు ఈ పింఛన్‌ ఏ మూలకు సరిపోతుంది. దీంతో కిడ్నీ రోగులు తమపొలాలు, ఇళ్లు అమ్ముకుని బతుకుపై ఆశతో నిత్యం వైజాగ్‌ వెళ్లి  చికిత్స చేసుకుంటున్నారు. డయాలసిస్‌ రోగుల లెక్కింపులో సైతం  టీడీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యహరించి రోగుల లెక్కను కుదించే ఎత్తులు వేసింది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో పూటగడవడమే కష్టంగా మారింది.

ఇటువంటి తరుణంలో ఇటీవల జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి   ‘నేనున్నానని’ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క కిడ్నీ రోగికి తాను ముఖ్యమంత్రి కాగానే రూ.10వేలు పింఛన్‌ ఇస్తానని, మీకు దగ్గరలోనే డయాలసిస్‌ యూనిట్‌లు ఏర్పాటు చేసి కిడ్నీ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జగన్‌మోహన్‌ రెడ్డి హామీ   తమకు కొండంత  ధైర్యాన్ని ఇచ్చిందని కిడ్నీ రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షిస్తున్నారు. 

కిడ్నీ రోగులకు జగన్‌ భరోసా ఇలా..
‘ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య తీవ్రంగా ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలో 200 పడకలతో కూడిన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతాం.   అధికారంలోకి రాగానే పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసి రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.
నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం.
వైద్యులను గ్రామాలకు పంపించి రక్త పరీక్షలు చేసి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి ప్రతి పేదవాడికీ తోడుగా ఉంటాం.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ రూ.10 వేలు ఇస్తాం

స్పెషలిస్ట్‌ వైద్యులను నియమిస్తాం
ఈ ప్రాంతంలో తాగునీరు కలుషితమైనందున  కిడ్నీ రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే కలుషిత నీటిని శ్వాశ్వతంగా నివారించేందుకు  వంశధార, మహేంద్రతనయ, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ల ద్వారా పైప్‌లైన్‌ వేసి ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందిస్తాం. బోర్లపై ఆధారపడకుండా సర్ఫేస్‌ వాటర్‌ తీసుకొస్తాం.

 చక్కటి ఆలోచన

కిడ్నీ బాధిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని రూ.10 వేలు పింఛన్‌ నెలకు ఇస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.  వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని కిడ్నీ రోగుల కష్టాలకు ఆయన పాదయాత్రలో కళ్లారా చూసి చలించిపోయారు. అందులో రీసెర్చ్‌ కేంద్రం 200 పడకలతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదో మంచి ఆలోచన. వేలాది మంది కిడ్నీ రోగులకు ఈ ప్రకటన ఊరట కలిగించింది. అంతా ఆయనకు అండగా నిలవాలి. 

–సంగారు రామయ్య, డయాలసిస్‌ రోగి సైనూరు, వజ్రపుకొత్తూరు మండలం

ఆర్ధిక భరోసా 

కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేసుకుంటే ప్రాణాలతో ఉండగలరు. రక్త శుద్ధి సమయంలో ప్రాణాలకు గ్యారంటీ లేదు. నేను నెలకు  నాలుగుసార్లు డయాలసిస్‌ చేసుకుంటున్నాను. నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతోంది. భోజనం  తినబుద్ధి కాదు. మందులు కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి.  జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. మంచిదే. 

    –ఎస్‌.రామూర్తి, డయాలసిస్‌ రోగి, యూఆర్‌కేపురం వజ్రపుకొత్తూరు మండలం

 కష్టాలు తీరుతాయి

కిడ్నీ రోగుల్లో ధనికులు, పేదలు ఉన్నారు. పేదవారికే కష్టాలన్నీ. 200 పడకలతో రోగుల కోసం ఆసుపత్రి కడతామన్న ఆలోచన మంచిది. రూ.10వేలు పింఛన్‌ ఇస్తే రోగులకు కొంత ఊరట లభిస్తుంది. విశాఖపట్నం వెళ్లి చికిత్స చేసుకోవాల్సిన దుస్థితి. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఆసుపత్రి కట్టిస్తామని చెప్పారు. బాగుంది. కట్టి తీరాలి. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. మాకు నమ్మకం ఉంది.    

–ఎస్‌. గంగయ్య, కిడ్నీ  వ్యాధిగ్రస్తుడు ,వజ్రపుకొత్తూరు మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top