రావాలి జగన్‌... కావాలి కిరణ్‌

People Wants Ysrcp Government Srikakulam  - Sakshi

సాక్షి, రణస్థలం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొర్లె కిరణ్‌కుమార్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.గణపతిరావుకు ఆయన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. కిరణ్‌కుమార్‌ సతీమణి గొర్లె పరిమళ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 10.10 గంటలకు నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. షనంతరం ఆయన సతీమణి గొర్లె పరిమళ నుదుట విజయ తిలకం దిద్దారు.

పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాగానే భారీ ఎత్తున మహిళలు నిండు నీళ్ల బిందులతో ఎదురువచ్చి హారతులిచ్చారు. అనంతరం జాతీయ సర్వీ సు రహదారిపై ఊరేగింపుగా తహసీల్దార్‌ కార్యాలయానికి చే రుకున్నారు. తీన్‌మార్‌ డ్యాన్సులతో యువత నృత్యాలు చేస్తూ ‘రావాలి జగన్‌.. కావాలి కిరణ్‌’ అని కేకలు వేస్తూ జాతీయ రహదారిని హోరెత్తించారు. మూడు కిలోమేటర్ల మేర వైఎస్సార్‌సీపీ జెండాల రెపరెపలతో కోలాహలం నెలకొంది. ప్రచార రథంపై తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోవడానికి సుమా రు గంటన్నరకుపైగా సమయం పట్టింది. రోజంతా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిరణ్‌ నామినేషన్‌ సందడి గురించే చర్చించుకున్నారు. 

టీడీపీ హయాం.. అవినీతి, అక్రమాల మయం
నామినేషన్‌ వేసిన అనంతరం ప్రచార రథంపై నుంచి పార్టీ శ్రేణులనుద్దేశించి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ అవినీతి, అక్రమాలలో టీడీపీ పూర్తిగా మునిగిపోయిందని.. జగనన్న వస్తేనే రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని తెలిపారు. కల్లబొల్లి మాటలతో చివరి రెండు నెలల ప్రభుత్వ నాటకాన్ని చూసి మోసపోతే కష్టాల పాలు కావలసివస్తుందన్నారు. స్థానిక పరిశ్రమలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజన్నా రాజ్యం కావాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను గెలిపించాలని కోరారు. 

విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనంతా అరచేతిలో స్వర్గం చూపించినట్లు ఉందని, రైతు పరిపాలన, ప్రజా పరిపాలన రావాలంటే రాజన్నా రాజ్యం రావాలని.. అది జగనన్నతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జె డ్పీటీసీ గొర్లె రాజగోపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులు నాయిని సూర్యనారాయణరెడ్డి, మొదలవలస చిరంజీవి, టోంపల సీతారాం, బల్లాడ జనార్దన్‌రెడ్డి, గొర్లె అప్పలనాయుడు, సనపల నారాయణరావు, దన్నాన రాజీనాయుడు, మీసాల వెంకటరమణ, పైడి శ్రీనివాసరావు, నాలుగు మండలాల పార్టీ నాయకులు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top