కదిలిన కడప

People Grand Welcomes YS Jagan in YSR Kadapa - Sakshi

జననేతకు పల్లెపల్లెనా బ్రహ్మరథం

జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పోటెత్తిన జనం

రైల్వేకోడూరు, రాజంపేట, కడప, పులివెందులలో ఘన స్వాగతం

వైఎస్సార్‌ ఉద్యాన కళాశాల విద్యార్థుల     దీక్షలకు మద్దతు

కడప పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు..         పీఠాధిపతి ఆశీస్సులు

పూలు చల్లి.. టపాసులు కాల్చి..     స్వాగతం పలికిన శ్రేణులు

వైఎస్‌ జగన్‌ను కలిసిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్‌  

అడుగడుగునా కాన్వాయ్‌ ఆపి..     జగన్‌తో మమేకమైన అభిమానులు

పులివెందులలో జగన్‌కు హారతి ఇచ్చి     దిష్టితీసిన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి

పల్లె కదిలింది.. జగన్నినాదం మార్మోగింది. ఎక్కడ చూసినా జనమే జనం.పొలం, రోడ్డు, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రతిపక్ష నేత కోసం ఎదురుచూస్తున్న ప్రజలే కనిపించారు. చిన్నపిల్లలను ఎత్తుకున్న తల్లులు.. వయస్సు మీద పడిన పెద్దోళ్లు.. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా కలిసేందుకు బారులు తీరారు. వారిని చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా సందడి కనిపించింది. రోడ్లపై స్వాగత తోరణాలు పక్కన పెడితే.. కడప, రాజంపేట, పులివెందుల మొత్తం జనాలతో కిక్కిరిసి ఇసుకేస్తే రాలనంత జనంతో పట్టణాల్లో  కేరింతలు కనిపించాయి.

సాక్షి కడప : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని శుక్రవారం జిల్లాకు విచ్చేశారు.అభిమాన నేత వస్తున్నారన్న ఆనందంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా వైఎస్‌ జగన్‌ సీఎం అంటూ చేస్తున్న నినాదాలు మిన్నంటాయి. రోడ్లపై పూలవర్షం.. బాణసంచా మోత.. బైక్‌ ర్యాలీలు.. హారతులతో జనం నీరాజనాలు పలికారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కూడా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ...అందరినీ దగ్గరకు తీసుకుని పేరుపేరున పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

రైల్వేకోడూరు, రాజంపేటలలో పోటెత్తిన జనం
ప్రతిపక్ష నేత వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరుజిల్లాలో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం జిల్లాకు పయనమయ్యారు. వైఎస్సార్‌–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని కుక్కలదొడ్డికి ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకోగానే ఘనస్వాగతం లభించింది.  మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి సరిహద్దు ప్రాంతానికి రాగానే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కోడూరు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బెలూన్లు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కుక్కలదొడ్డి నుంచి శెట్టిగుంట, ఉప్పరపల్లె, శాంతినగర్, సూరపురాజుపల్లె తదితర గ్రామాల వద్ద మహిళలు రోడ్డుపైకి వచ్చిన కాన్వాయ్‌ని ఆపి వైఎస్‌ జగన్‌తో మమేకమయ్యారు. రైల్వేకోడూరులో కూడా రోడ్డంతా జనాలతో నిండిపోయింది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు కాన్వాయ్‌ వెంట జనాలు పరుగులు తీశారు. కోడూరు నుంచి మంగంపేట, కొర్లకుంట, ఓబులవారిపల్లె, ముక్కవారిపల్లె క్రాస్, కమ్మపల్లెక్రాస్, రెడ్డిపల్లె, అనంతంపల్లె, అప్పరాజుపేట రైల్వేగేటు, పుల్లంపేట, ఉడుగువారిపల్లె, పుత్తనవారిపల్లె, కనకదుర్గమ్మ కాలనీ, అనంతయ్యగారిపల్లె, ఊటుకూరు ఇలా ఎక్కడ చూసినా పల్లెలు సైతం కదిలివచ్చి జననేత జగన్‌ను పలుకరించారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిపల్లె ఆర్చి వద్ద నుంచి స్వాగతం పలుకుతూ వైఎస్‌ జగన్‌ను తీసుకెళ్లారు. కుక్కలదొడ్డి నుంచి రాజంపేటకు చేరుకోవడానికి దాదాపు ఒంటి గంట సమయం పట్టింది. మిట్టమధ్యాహ్నం ఎండవేడికి అధికంగా ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా జనాలు రాజంపేటలో బ్రహ్మరథం పట్టారు.భువనగిరిపల్లె ఆర్చి నుంచి పాతబస్టాండు, అమ్మవారిశాల, పెద్ద మసీదు, మార్కెట్, ఆర్టీసీ సర్కిల్,  ఏఐటీయూసీ సర్కిల్‌ ఇలా ఎక్కడ చూసినా జనమే కనిపించారు. బయనపల్లె క్రాస్‌ వద్ద విద్యార్థులు వందల సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎర్రబల్లి మీదుగా నందలూరు, మంటపంపల్లె, చెర్లోపల్లె, ఒంటిమిట్ట, మాధవరం, భాకరాపేట, కనుమలోపల్లె, జేఎంజే కళాశాల వద్దకు రావడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.

కడపలో బ్రహ్మరథం
కడప నగర శివార్లలోని జేఎంజే కళాశాల వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే అంజద్‌బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో  ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి వైఎస్‌ జగన్, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి   ర్యాలీగా కడపలోకి ప్రవేశించారు. అడుగడుగునా జై జగన్‌ నినాదం మార్మోగింది. రోడ్డు వెంబడి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకగా, ఎక్కడికక్కడ రోడ్డుపైకి వచ్చి మహిళలు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ని ఆపి మాట్లాడుతూ వచ్చారు. కడప జేఎంజే కళాశాల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైతే కడప సరిహద్దులు దాటడానికి సాయంత్రం 7.30 గంటలు అయిందంటే ఏ మేరకు కిటకిటలాడిందో అర్థమవుతోంది. చిన్నచౌకులోని మేయర్‌ సురేష్‌బాబు సోదరుడు సతీష్‌ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  కడప బిల్టప్‌ నుంచి బయలుదేరిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కేఎస్‌ఆర్‌ఎం, మిట్టమీదపల్లె, యల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలంలలో కాన్వాయ్‌ ఆపి కరచాలనం చేశారు. వేంపల్లెలో భారీగా తరలివచ్చిన జనం అఖండ స్వాగతం పలికారు. స్వంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే అడుగడుగునా హారతులు పట్టారు. పులివెందులకు చేరుకోగానే ఇంటివద్ద నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌కు సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి హారతి పట్టి..దిష్టితీసి గుమ్మడికాయ కొట్టారు.

పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
కడపలోని అమీన్‌పీర్‌ (పెద్దదర్గా) దర్గాలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూలచాదర్‌ గురువుల మజార్‌ వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ఫాతెహా చేశారు. తర్వాత దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా పెద్దదర్గా ప్రాంతమంతా ఎక్కడ చూసినా వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ముస్లిం సోదరులు, ఇతర కార్యకర్తలతో నిండిపోయింది.

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను శుక్రవారం పలువురు నేతలు కలిసి చర్చించారు. దారి మధ్యలో కడప, రాజంపేట మాజీ ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాష, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సురేష్‌బాబు, నెల్లూరుజిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్, బద్వేలు సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితోపాటు పలువురు నాయకులు అనేక అంశాలపై చర్చించారు. రాజకీయాలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు.

జననేతకు ఘన స్వాగతం
పులివెందుల : వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి 9గంటలకు కడప నుంచి పులివెందులకు చేరుకున్నారు. కడప నుంచి వస్తున్న ఆయనకు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. వైఎస్‌ జగన్‌ 9గంటలకు స్వగృహానికి చేరుకోగానే అక్కడ వేచి ఉన్న ప్రజలు జై జగన్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. వైఎస్‌ జగన్‌ చెరగని తన చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పలకరించారు.

విజయ హారతి పట్టిన వైఎస్‌ భారతమ్మ
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకుని శుక్రవారం రాత్రి స్వగృహానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సతీమణి వైఎస్‌ భారతమ్మ విజయ హారతి ఇచ్చి ఇంటిలోకి స్వాగతం పలికారు. వైఎస్‌ భారతమ్మతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం స్థానిక సీఎస్‌ఐ చర్చికి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతిరెడ్డి.ఇతర కుటుంబ సభ్యులతో కలిసి  నివాళులర్పించనున్నారు.

విద్యార్థులకు దీక్షకు సంఘీభావం
రైల్వేకోడూరులోని వైఎస్సార్‌ ఉద్యాన కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంఘీభావం తెలియజేశారు. ఉద్యానశాఖలో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు అర్హులైన హార్టికల్చర్‌ విద్యార్థులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ 15 రోజులుగా దీక్షలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రైల్వేకోడూరు వద్దగల దీక్షా ప్రాంగణం వద్ద వారికి మద్దతు తెలిపి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు  గ్రామ సచివాలయం ద్వారా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top