హరిపురంలో ఉద్రిక్తత

People Agitated In Srikakulam - Sakshi

హరిపురం, ఉద్దానంలోని కొన్ని గ్రామాల ప్రజల మధ్య వివాదం

ఆస్పత్రిలో మొదలైన తగాదా

రంగంలోకి దిగిన పోలీసులు

మందస : మండలంలోని హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఓ చిన్న సమస్య చివరకు గాలివానలా మారింది. హరిపురం, ఉద్దానంలోని కొన్ని గ్రామాలకు చెందిన ప్రజల మధ్య కొద్దిరోజులుగా నలుగుతున్న ఈ వివాదం మంగళవారం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి పరిస్థితులు చక్కదిద్దారు. 

హరిపురంలో ఉద్దానంవాసుల ధర్నా..

హరిపురం యువకులు ఉద్దానాన్ని తూలనాడారని, ముగ్గుర్ని అన్యాయంగా తీసుకెళ్లి దాడి చేశారంటూ ఉద్దానంలోని సుమారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో  వచ్చి హరిపురంలో మంగళవారం నిరసనకు దిగారు. ఓ వైపు హరిపురంలో బంద్‌ కొనసాగుతుండగానే.. మరోవైపు ఉద్దానానికి చెందిన వీరంతా నిరసన ప్రారంభించారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ తరుణంలో ఎస్‌ఐ యర్ర రవికిరణ్‌ పోలీసులతో వచ్చి, పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాసరి తాతారావు, లబ్బ రుద్రయ్య, డొక్కరి దానయ్య, పులారి కూర్మారావు, పీతాంబరం, కారి ఈశ్వరరావు, సార దూర్వాసులు, బదకల జానకిరావుతో పాటు మరికొందరు గ్రామస్తులు హరిపురం జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి పోలీసులు వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో తోపులాట జరిగింది.

అనంతరం వీరంతా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, మౌనం పాటించారు. అక్కడి నుంచి బాలిగాం-హరిపురం జంక్షన్‌ వద్దకు వచ్చి న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈ సమయంలోనే టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి వచ్చి శాంతింపజేసే ప్రయత్నించారు. 

హరిపురం గ్రామస్తుల ప్రత్యేక సమావేశం..

హరిపురం కమ్యూనిటీ హాల్‌లో గ్రామస్తులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రి తీరు సక్రమంగా లేదని, వైద్యం సరిగ్గా అందడంలేదని ఆరోపించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కచించుకోవాలని వక్తలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. డాక్టర్‌ కామేశ్వరరావు హరిపురం ప్రజలకు సంతకాలు చేయననడం సబబుకాదని, వైద్యులు కచ్చితంగా ఆసుపత్రి సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఎవరితో శత్రుత్వం వద్దని హితవు పలికారు. సమావేశంలో కొట్ర రామారావు, మట్ట ఖగేశ్వరరావు, పుల్లా వాసుదేవు, కణగల జగ్గారావు, యెరుకోల సోమేశ్వరరావు, వారణాసి అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. 

సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి: డీఎస్పీ 

కాశీబుగ్గ డీఎïస్పీ బి.ప్రసాదరావు, సోంపేట, కాశీబుగ్గ సీఐలు ఎన్‌.సన్యాసినాయుడు, వేణుగోపాలరావు, మందస, సోంపేట, బారువా, కాశీబుగ్గ ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, కానిస్టే  బుల్స్‌ చేరుకుని ఉద్దానానికి చెందిన పలు గ్రామాల ప్రజలతో చర్చలు జరిపారు. ఏ ప్రాంతమైనా ఒక్కటేనని, అందరూ సమన్వయం పాటిం చాలని కోరారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరువర్గాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి, వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రసాదరావు దౌత్యం ఫలించడంతో నిరసన చేస్తున్న ఉద్దానం ప్రజలు శాంతించారు.

ఇరుపక్షాల ఫిర్యాదుల ఉపసంహరణ

మందస మండలంలోని హరిపురంలో మంగళవారం జరిగిన వివాదం సద్దుమణిగింది. సోంపేట సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, మందస ఎస్‌ఐ యర్ర రవికిరణ్‌లు సమయస్పూర్తిగా వ్యవహరించి ఇరువర్గాలను మందస పోలీసు స్టేషన్‌కు రప్పించి చర్చలు జరిపారు. హరిపురం నుంచి కొట్ర రామారావు, కణగల జగ్గారావు, కొట్ర వైకుంఠరావు, పుల్లా వాసుదేవు, ఆనల వెంకటరమణ తదితరులు, ఉద్దానం ప్రాంత గ్రామాల నుంచి ఎంపీపీ ప్రతినిధి దాసరి తాతారావు, డొక్కరి దానయ్య, లబ్బ రుద్రయ్య, పులారి కూర్మారావు, మామిడి కృష్ణారావు తదితరులు చర్చలకు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. దీంతో ఇరువర్గాలు పెట్టిన ఫిర్యాదులను ఉపసంహరించుకుని, ఇకపై అంతా కలసి మెలసి ఉంటామని హామీఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top