కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు

Pensions to Above One Lakh People newly in AP - Sakshi

మొత్తం 59.03 లక్షల మందికి నేడు రూ.1,442.21 కోట్లు పంపిణీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్‌ డబ్బులు అందుకోనున్నారు. మొత్తమ్మీద 59.03 లక్షల మందికి ప్రభుత్వం బుధవారం పింఛన్‌ డబ్బులను పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయమే ఎక్కడికక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్‌ డబ్బుల పంపిణీ మొదలు పెట్టనున్నారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు  పింఛన్‌ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్‌ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు.  

► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్‌ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. 
► లాక్‌డౌన్‌ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.  
► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్‌ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. 
► కాగా, జూన్‌ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్‌ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top