పింఛన్‌ ఇక రూ.2 వేలు

Pension is here after Rs 2000 says Chandrababu - Sakshi

జన్మభూమి ముగింపు సభలో సీఎం చంద్రబాబు ప్రకటన

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంక్రాంతి కానుకగా పింఛను మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఈనెల మిగిలిన రూ.వెయ్యిని కలిపి ఫిబ్రవరిలో రూ.మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.రెండు వేలు చొప్పున పింఛన్‌ అందుతుందని వివరించారు. జన్మభూమి – మాఊరు 6వ విడత ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా బోగోలు మండలంలో సీఎం పర్యటించారు. చిప్పలేరు హైలెవల్‌ వంతెన ప్రారంభించిన అనంతరం శ్రీపొట్టి శ్రీరాములు స్వగ్రామంలో స్మారక భవనాన్ని సందర్శించి విగ్రహన్ని ఆవిష్కరించారు. రూ.110 కోట్లతో జువ్వల దిన్నె గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బోగోలు జన్మభూమి సభలో సీఎం మాట్లాడుతూ పింఛన్ల ద్వారా 54 లక్షల మందికి మేలు జరుగుతోందని చెప్పారు.

విద్యార్థినుల కోసం రక్ష పథకం పేరుతో రేషన్‌ షాపుల ద్వారా శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాను, వార్డు డెవలప్‌మెంట్‌ ప్లానుకు కూడ ఈ సభ నుంచే శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో 66,276 ఎకరాల సీజెఎఫ్‌ఎస్‌ భూములకు పట్టాలు ఇచ్చి పసుపు కింద మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమం ఈవేదిక నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మిగిలిన మొత్తాన్ని 10 శాతం వడ్డీతో ఈనెలలోనే విడుదల చేస్తామన్నారు.

ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిని రూ. 5 లక్షలకు పెంచుతామన్నారు. పోలవరం ద్వారా గ్రావిటీతో  మే నెలలో నీటిని విడుదల చేసి డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దగదర్తి మండలం దామవరం గ్రామంలో 1,379.71 ఎకరాల్లో నెల్లూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పాశం సునీల్‌ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ,పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లినేని రామారావు,ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీదా మస్తానరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top