సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి

Pending Works Complete in Summer YS Avinash Reddy - Sakshi

ఎత్తిపోతల ద్వారా నీరందాలి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

యురేనియం పైపులైన్‌ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో ఎంపీ భేటీ

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల: ముఖ్యమంత్రి ఈనెలలో చేపట్టనున్న పర్యటన నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఏపీ కార్ల్‌లో నియోజకవర్గ అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులతో ఆయన ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి శాఖల వారీగా సమీక్షించారు. ఇప్పటికే పలుపర్యాయాలు ఈయన సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23నుంచి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనుండటంతో శుక్రవారం అధికారులతో ఎంపీ మరోమారు భేటీ అయ్యారు.

వేసవికల్లా సాగునీరు
లింగాల కెనాల్, లెఫ్ట్‌ కెనాల్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల గురించి అవినాష్‌రెడ్డి ఆరా తీశారు. భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించి నివేదికలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ పనుల నివేదికలు జనవరి 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలన్నారు. లింగాల బ్రాంచ్‌ డిస్ట్రిబ్యూటరీ పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి. ఈనెలాఖరుక ల్లా మైక్రో ఇరిగేషన్‌ ప్రతిపాదనలు సిద్ధం చే యాలని చెప్పారు. వచ్చే వేసవి నాటికి ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేసి సాగునీరు అందేలా చూడాల ని కోరారు. సీబీఆర్‌ కుడి
కాలువకు సంబంధించి 9, పీబీసీలో 6 పనులకు త్వరలోనే టెండర్లను పిలుస్తామని ఇరిగేషన్‌ అధికారులు ఎంపీకి తెలిపారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేసిన నెల రోజుల్లోపు పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయనసూచించారు.

యురేనియం పైపు లైను ప్రతిపాదనలు
యురేనియం గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు పైపులైన్‌ పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీ సూచించారు. మైక్రో ఇరిగేషన్‌ విషయంలో నియోజకవర్గం మోడల్‌గా ఉండేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ పనులపై ఆరా తీశారు. మైనర్‌ ఇరిగేషన్‌లో చెక్‌డ్యాంలు, ట్యాంక్‌లు, పొలాలు కోతకు గురి కాకుండా ప్రొటెక్షన్‌ వాల్స్‌కుసంబంధించి  రూ.30కోట్లు అంచనాతో 203పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. వేముల చెరువు పక్కన నష్టపోయిన కొంతమంది చీనీ రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. చెక్‌డ్యాంలు, ట్యాంక్‌ల వల్ల భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు.

ఇళ్ల స్థలాలు సిద్ధం చేయండి
ఉగాది నాటికి అర్హులందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో స్థలాల సేకరణ పూర్తికావాలని ఎంపీ చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు హడావుడిగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని.. కానీ వారికి స్థలాలు చూపించలేదన్నారు.  లేఔట్లు వేసి అర్హులకు ఇంటి స్థలాన్ని చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ చెప్పారు. ఉగాది పండుగ ముందు రోజు వరకు కూడా అర్హులుంటే గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు గ్రామాలకు దగ్గరగా ఉండే విధంగా చూడాలన్నారు.  పీబీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిణి, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ ప్రసన్నకుమార్, హౌసింగ్‌ పీడీ రామచంద్రన్, డీఈ వీరన్న, పులివెందుల కమిషనర్‌ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను అవినాష్‌రెడ్డి పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top