నాలుగు విడతల్లో రుణాల మాఫీ

Peddi Reddy Ramachandra Reddy Asserted Dwakra Loan Waiver in Four Installments - Sakshi

మేనిఫెస్టో  హామీల అమలుకు ప్రత్యేక చర్యలు

అక్టోబర్‌ 15న రైతు భరోసా ప్రారంభం

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, మదనపల్లె(చిత్తూరు): ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, మరో నాలుగేళ్లలో నాలుగు విడతలుగా డ్వాక్రా మహిళా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన మదనపల్లెలో పర్యటించారు. ఎమ్మెల్యే మహమ్మద్‌ నవాజ్‌ బాషా ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో మదనపల్లె నియోజకవర్గంలోని మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక తొలి బడ్జెట్‌ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలకు సంబంధించి చట్టాలు తీసుకువచ్చారని చెప్పారు.

అక్టోబర్‌ 2 నుంచి వచ్చే ఉగాదివరకు అమలుచేసే హామీలకు సంబంధించి తేదీలు నిర్ణయించడం ఒక్క వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పుడు అప్పు రూ.14,200 కోట్లు ఉండేదన్నారు. 2019కి వచ్చేసరికి అది కాస్తా 28,615 కోట్లు అయిందన్నారు. వాటన్నంటినీ నాలుగేళ్లలో నాలుగు విడతల్లో జమచేసే దిశగా సీఎం చర్యలు తీసుకుం టున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో 2,825 కోట్లు మహిళా రుణాలు, వడ్డీలేని రుణాలు 12.5 కోట్లు ఉన్నాయని, త్వరలోనే మాఫీ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.  అక్టోబర్‌ 15న రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 8,000 కోట్లకు పైగా పెట్టుబడి నిధి అందజేయనున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మహమ్మద్‌ నవాజ్‌ బాషా మాట్లాడుతూ నియోజకవర్గంలో 375 మహిళా సంఘాలకు సంబంధించి 21.84 కోట్లు బ్యాంక్‌ లింకేజి రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ఐసీడీఎస్, మెప్మా సిబ్బంది ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు మురళీ, జ్యోతి, కమిషనర్‌ లోకేశ్వర వర్మ, సింగిల్‌విండో చైర్మన్‌లు దండు కరుణాకర్‌ రెడ్డి, రెడ్డిశేఖర్, కేశవరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు పోకల అశోక్‌ కుమార్, బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

గండికోట నుంచి తాగునీటిని అందిస్తాం
వాల్మీకిపురం: దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న చిత్తూరు జిల్లాకు త్వరలోనే గండికోట రిజర్వాయర్‌ ద్వారా తాగునీటిని అం దించి పరిష్కారం చూపుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని గండబోయనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.  పెద్దిరెడ్డి మాట్లాడుతూ రూ.10వేల కోట్ల నిధులతో జిల్లా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.

ఈ నిధులతో కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని 32 మండలాలకు, రాయచోటి నియోజకవర్గం మొత్తానికి పైప్‌లైన్‌ ద్వారా తాగునీటిని సరఫరా చేసి ప్రతి గడపకు నల్లా ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, మౌళిక వసతులపై దృష్టి సారిస్తామని, మంత్రి పెద్దిరెడ్డి సహాయ సహకారాలతో రాబోవు రోజుల్లో నియోజకవర్గాన్ని పారిశ్రామిక పరంగా కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు హరీష్‌ రెడ్డి, చింతల శివానంద రెడ్డి, హబీబ్‌బాషా, నక్కా చంద్రశేఖర్, ముక్తియార్, శ్రీనాథ రెడ్డి, ఫారుఖ్, అప్పోడు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top