పెదబయలు మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సంతకు వచ్చిన గిరిజనలు, రైతులు అవస్థలు పడ్డారు.
- తడిసి ముద్దయిన పసుపు, పిప్పళ్లు
- మరింత పతనమైన మార్కెట్ ధర
- గిరిజన రైతుల ఆవేదన
పెదబయలు, న్యూస్‌లైన్: పెదబయలు మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సంతకు వచ్చిన గిరిజనలు, రైతులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం బాగుండి ఒక్క సారిగా వాతావరణంలో మర్పు సంభవించి భారీ వర్షం కురిసింది. దీంతో సంతలో అమ్మకానికి తెచ్చిన పసుపు, పిప్పళ్లు తడిసిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో రైతులు తెచ్చిన సరుకులు, వ్యాపారులు కొనుగోలు చేసిన బస్తాలు నానిపోయాయి. ఉన్న ఫళంగా వాన పడడంతో ఏం చేయాలో తోచక సరుకును అక్కడికక్కడే వదిలేశారు.
పసుపు, పిప్పళ్లు వర్షానికి తడిసిపోవడంతో కొనడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో చాలా మంది గిరిజన రైతులు వ్యాపారులను బతిమాలి ఎంతోకొంతకు తీసుకోవాలని కోరారు. అయితే వ్యాపారులు కొనుగోలు చేసిన బస్తాలు కూడ పూర్తిగా తడిసిపోయాయి. పిప్పళ్లు, పిప్పళ్ల నలక పాడయ్యే ప్రమాదం ఉందని వ్యాపారులు, రైతులు న్యూస్‌లైన్‌కు తెలిపారు.
ఇలాంటి ఆపత్కాలంలో సరుకును నిల్వ ఉంచేందుకు గోదాములు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందారు. గతంలో సంతకు షెడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన అరకులోయ ఎమ్మెల్యే సివేరి సోమ ఇప్పుడు జాడలేకుండా పోయారని రైతులు ఆవేదన చెందారు. గోదాములు నిర్మించి ఉంటే ధర తగ్గిన సమయంలో వాటిలో నిల్వచేసే వీలుంటుందని అంటున్నారు. గిరిజనులు ఓట్లతో గెలిచిన నాయకులు ఆ తరువాత ప్రజల కష్టాలు మరిచిపోతున్నారని అన్నారు.