సులువుగా పాస్‌పోర్టు

Passport Get Easy From Passport Centres - Sakshi

పాస్‌పోర్టు అంటే దేశం వదిలి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రం. పని ఏదైనాసరే విదేశాలకు వెళ్లాలనుకునే వారందరూ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఇది ఉంటేనే ఏ దేశంలోనైనా వీసా లభిస్తుంది. వీసా అంటే సదరు దేశంలోకి అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వాలు మంజూరు చేసే పత్రం. అంటే విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మొట్టమొదట అవసరమయ్యేది ‘పాస్‌పోర్టు’. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు కేంద్రాలను ప్రజలకు మరింత చేరువ చేసింది. అయితే ఈ కేంద్రాలను ఏ దశలో, ఎలా సంప్రదించాలనే విషయంపై చాలామందికి అవగాహన లేదు. దీంతో ఉన్నత విద్యావంతులు సైతం ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

అనంతపురం టౌన్‌: అనంతపురం ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో జిల్లావాసులు పాస్‌పోర్టు పొందడం సులువైంది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కోసం ఆన్‌లైన్‌లో ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి, పాస్‌ పోర్టు సేవా కేంద్రంలో ఏమేమి సర్టిఫికె ట్టు సమర్పించాలి తదితర ఆంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పాస్‌పోర్టుకు ఎవరికి వారే సొంతంగా(దళారులను ఆశ్రయించకుండా) నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.
పాస్‌పోర్టు ఏ దశలో ఉందో ఇలా తెలుసుకోవచ్చుపాస్‌పోర్టు సేవా కేంద్రంలో ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత ఎక్కువ జాప్యం జరిగితే  http://www.passportindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఊదా రంగులో కనిపించే ట్రాక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌ను క్లిక్‌ చేయాలి. తద్వారా మన పాస్‌పోర్టు ఏ దశలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.

ఏజెంట్లను ఆశ్రయించొద్దు
పాస్‌పోర్టు కోసం ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే అన్ని వివరాలు చెబుతారు. వాటి ఆధారంగా పాస్‌పోర్టు కోసం ఆన్‌లైన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును చెల్లించి నమోదు చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన తేదీన నేరుగా పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి పాస్‌పోర్టు ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– స్వాతి మధురిమ,తపాలా సూపరింటెండెంట్‌

మొదటి దశ
పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే మొదటిదశ ఆన్‌లైన్‌ దశ. ఇందులో మొదట  www.passportindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. వెబ్‌సైట్‌లో కుడివైపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఫొటో కనిపిస్తుంది. ఎడమ వైపున ఎగ్జిస్టింగ్‌ యూజర్‌ లాగిన్‌(పచ్చరంగు), న్యూ యూజర్‌ రిజిస్టర్‌నౌ(ఎర్రరంగు), ట్రాక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌(నీలంరంగు), చెక్‌ అప్పాయింట్‌మెంట్‌ అవైలబు లిటీ(పసుపు పచ్చరంగు) అనే బాక్సులు నాలుగు ఉంటాయి. వాటిలో న్యూ యూజర్‌ రిజిస్టర్‌నౌ అనే ఎర్రరంగు బాక్స్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఒక చిన్న ఫ్రీ అప్లికేషన్‌ వస్తుంది. అందులో తమకు వర్తించే అంశాలను జాగ్రత్తగా పూరించాలి. మీ పేరు రిజిస్టర్‌ అయినట్లు లాగిన్‌ నెంబర్‌ (యూజర్‌ ఐడీ) వస్తుంది.

రెండవ దశ
యూజర్‌ ఐడీ వచ్చిన తర్వాత రెండో దశ ప్రారంభం మవుతుంది. ఈసారి వైబ్‌సైట్‌లోని నాలుగు గళ్లల్లో పచ్చగా ఉన్న ఎగ్జిస్టింగ్‌ యూజర్‌ లాగిన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మనకు వచ్చిన నెంబర్‌ టైప్‌ చేసి లాగిన్‌లోకి వెళ్లాలి. దరఖాస్తు ఫారం వస్తుంది. అందులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి మనకు వర్తించే వాటిని పూరించాలి. వైబ్‌సైట్‌లోని ఇన్‌ఫర్మేషన్‌ కార్నర్‌లో ఫీజు వివరాలుంటాయి. ఆన్‌లైన్‌లో రూ.1,500 ఫీజు చెల్లించాలి. అప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్‌తోపాటు ఏఆర్‌ఎన్‌ ఫారం వస్తుంది. అప్పుడు మీరు ఎంపిక చేసుకున్న పాస్‌పోర్టు సేవా కేంద్రం లభ్యతను బట్టి స్లాట్‌ను కేటాయిస్తారు. తేదీతోపాటు టైమ్‌ సైతం వస్తుంది. దాని ప్రకారం దరఖాస్తుదారుడు పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లాలి.

మూడవ దశ
ఈ దశలో పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న ఏఆర్‌ఎన్‌ ఫారంతోపాటు ఒరిజనల్‌ సర్టిఫికెట్లు(పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌లో పొందుపరచిన ధ్రువీకరణ పత్రాలు) తీసుకెళ్లి మొదట రిసెప్షన్‌ కమ్‌ టోకన్‌ ఇష్యూ కౌంటర్‌లో సంప్రదించాలి. అక్కడ డ్యాక్యుమెంట్లు(ధ్రువీకరణ పత్రాలను) పరిశీలించి టోకెన్‌ నెంబర్‌ ఇస్తారు. పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారులు పిలిచేంత వరకు వెయిటింగ్‌ గదిలో వేచి ఉండాలి. ఆ తర్వాత మనకు వచ్చిన టోకెన్‌ నెంబర్‌ను బట్టి ఏ1, ఏ2, ఏ3 కౌంటర్లలో ఏదైనా ఒక కౌంటర్‌లోకి వెళ్తే అక్కడ ఫొటోతోపాటు బయోమెట్రిక్‌ విధానంతో రెండు చేతి వేలి ముద్రలను, సంతకాన్ని తీసుకుంటా రు. ఆ తర్వాత మన ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కౌంటర్‌కు వెళతాయి. అనంతరం పాస్‌పోర్టు అధికారి కొన్ని ప్రశ్నల ద్వారా ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాటిలో అక్షరం తేడా వచ్చినా వెనక్కి పంపిస్తారు. పరిశీలనాధికారి సంతృప్తి పొందిన తర్వాత పాస్‌పోర్టు జారీ కోసం మన వివరాలు విశాఖపట్నం రీజనల్‌ కార్యాలయానికి వెళతాయి. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుదారునికి దగ్గర్లోని పోలీసులు విచారణ చేసి రిపోర్టు పంపుతారు. ఎలాంటి కేసులు లేకుంటే పాస్‌పోర్టు మన చేతికి అందుతుంది. దీనికి సుమారు 15రోజులు పడుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top