పలాస ఆస్పత్రి.. రిమ్స్‌కు అనుసంధానం

Palasa Super Speciality Hospital Connected With RIMS In Srikakulam - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో ఏర్పాటు చేయనున్న 20 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ యూనిట్లను శ్రీకాకుళంలోని రిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకు వస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. రూ. 50 కోట్ల ఖర్చుతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ యూనిట్లను పలాసలో ఏర్పాటు చేయనున్న విషయం పాఠకులకు తెలిసిందే. 

వైద్య విద్యార్థులు, రోగులకు ఉపయోగకరం
ఇక్కడ పనిచేసేందుకు ఐదు రెగ్యులర్‌ పోస్టులు, 100 పోస్టులు కాంట్రాక్టు విధానంపైన, 60 పోస్టులు ఔట్‌ సోర్సింగ్‌ విధానంపైన భర్తీ చేసేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిమ్స్‌కు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అనుసంధానం చేయడం వల్ల ఇక్కడి వైద్య విద్యార్థులకు, పలాస సూపర్‌ స్పెషాలిటీలోని రోగులకు ఎంతో ఉపయోగం కానుంది. వైద్య విద్యార్థులు రీసెర్చ్‌ సెంటర్‌లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి పలు విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిమ్స్‌లోని వైద్యులు, వైద్య విద్యార్థులు సూపర్‌ స్పెషాలిటీలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు కూడా వీలు కలుగుతుంది.

జిల్లాలోని పలు కమ్యూనిటీ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలో కొనసాగుతున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా వైద్య విధాన పరిషత్‌కే అప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ప్రభుత్వం రిమ్స్‌కు అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వలె కాకుండా  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన పోస్టులను కూడా  మంజూరు చేయడం పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నియమించనున్న ఉద్యోగులకు ఏటా రూ.8.93 కోట్లు జీతాల కోసం వెచ్చించనున్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు
ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించినపుడు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి  కష్టాలతో పాటు వారి కుటుంబాలు పడుతున్న అవస్థలను నేరుగా తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే  ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని పలాసకు మంజూరు చేస్తూ ఇటీవలే  శంకుస్థాపన సైతం పూర్తి చేశారు. 
అదే విధంగా కిడ్నీ రోగులకు మనోధైర్యం కల్పించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉద్దానం ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

విధి విధానాలు తెలియాల్సి ఉంది
రిమ్స్‌ ఆస్పత్రికి పలాస సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం విషయం తెలుసుకున్నాను. ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి తమకు ఇంకా అందకపోయినా ఆదేశాలను చదివాను. అయితే ఈ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిమ్స్‌కు మరో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం చేయడం ఎంతో ఉపయోగకరం. 
–  డాక్టర్‌ కృష్ణవేణి, రిమ్స్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top