నిరుద్యోగులను నట్టేట ముంచిన మాజీ మంత్రి ఆది

Outsourcing Job Issue Kurnool - Sakshi

పశుసంవర్ధక  శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

భారీగా ముడుపులు సమర్పించుకున్న వైనం 

సాక్షి, కర్నూలు : ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన సంతోషం వారికి ఎంతో కాలం లేదు. చేరినప్పటి నుంచి ఇంతవరకు వేతనాలు లేవు. ముడుపులు పుచ్చుకొని ఉద్యోగాలు ఇప్పించిన టీడీపీ మాజీ మంత్రి పత్తా లేకుండా పోయారు. పశుసంవర్ధకశాఖలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు, గోకులాలను టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేపట్టారు.

ఇందుకు సంబంధించి డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఏర్పడింది. తొలుత అవసరాలకు తగిన విధంగానే నియమించారు. ఎన్నికల ముందు గత ఏడాది చివరిలో మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సిఫారసులతో అవసరం లేకపోయినా అడ్డుగోలుగా టెక్నికల్‌ మానిటర్, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరికి  ఆశచూపి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసుకొని అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా గుంటూరుకు చెందిన రెడ్డి ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం కొద్ది రోజులకే ఆవిరయ్యింది.

ఆరు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే ‘బిల్లు అయితే పెట్టాము... అది ఆర్డినరీ బిల్లు కావడంతో  మంజూరు అయినప్పటికీ సంబంధిత నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేము’ అని చెప్పినట్లు తెలిసింది. డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లాలో 45 మందికి పైగా ఉన్నారు. వీరిలో 30 మందికి పైగా ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. అయితే ఒక్క నెల జీతం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 13 నుంచి విధులకు హాజరు కాలేమని, సోషల్‌ అడిట్‌ నిర్వహించలేమని చేతుతెత్తేశారు. జీతాలు లేనందున ముడుపుల కింద ఇచ్చుకున్న నగదును వెనక్కి ఇచ్చే విధంగా టీడీపీ నేతపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top