కడప బంద్‌ : హోరెత్తిన ఉక్కు నినాదం

Opposition Calls for Kadapa Bandh For Steel Plant - Sakshi

సాక్షి, కడప : ఉక్కు ఉద్యమం హోరెత్తుతోంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు, అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు తగుదనమ్మా అంటూ దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్‌ అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష నేతలు నిర్ణయించామన్నారు.

  • మైదుకూరు  : మైదుకూరులో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఇరంగం రెడ్డి, వామపక్ష నేతలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
  • పులివెందుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో ఉక్కు నినాదం హోరెత్తింది. విభజన చట్టంలో హామీల అమలను డిమాండ్‌ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద బైఠాయించారు. అనంతరం అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.
  • బద్వేలు : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ జిల్లా బంద్‌కు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బద్వేలు నేతలు బంద్‌ నిర్వహించారు. బస్‌ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నినాదాలతో బద్వేల్‌ హోరెత్తింది. ఈ మేరకు బస్సులు డిపోలకు పరిమితం అవ్వగా ప్రవేటు వాహనాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.
  • రాయచోటి : అఖిలపక్షం పిలుపు మేరకు ఉక్కుసంకల్పం పేరుతో రాయచోటిలో బంద్ జరుగుతోంది. ఆర్టీసి డిపో ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు భైఠాయించారు. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు ఒక రోజు ముందే సెలవు ప్రకటించాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్‌మోహన్ రేడ్డి, జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, సీపీఐ నాయకులు విశ్వనాథ్, వైఎస్సార్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌లు బంద్‌లో పాల్గోన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఇతర నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
  • జమ్మలమడుగు : వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బంద్‌ నిర్వహించారు. వామపక్షాలు, జనసేనలు వైఎస్సార్‌సీసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
  • రాజంపేట : ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బంద్‌ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలతో పాటు ఇతర విద్యార్ధి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌ దీక్ష నిజమైతే టీడీపీ బంద్‌లో ఎందుకు పాల్గొనడం లేదని అమర్‌ నాథ్‌ రెడ్డి ప్రశ్నించారు.
  • కడప : ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అఖిలపక్ష నేతలు బంద్‌ నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే అన్ని పార్టీల నేతలు రోడ్డు మీదకు వచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. కడప మేయర్‌ సురేష్‌ బాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అంజాద్‌ బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జనసేన జిల్లా నాయకుడు రంజిత్‌ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top