ఒక ఉద్యోగం, రెండు వేతనాలు | one employee getting double salaries | Sakshi
Sakshi News home page

ఒక ఉద్యోగం, రెండు వేతనాలు

Sep 21 2013 2:29 AM | Updated on Oct 19 2018 7:19 PM

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ)శాఖ హుజూర్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని మానిటరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న లక్కాకుల వెంకటకృష్ణ అవినీతి బాగోతం బట్టబయలైంది.

 హుజూర్‌నగర్, న్యూస్‌లైన్
 నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ)శాఖ హుజూర్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని మానిటరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న లక్కాకుల వెంకటకృష్ణ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఖమ్మం ఎన్‌ఎస్‌పీ లో ఇటీవల జరిగిన ఆడిటింగ్‌లో అతని అవి నీతి వెలుగులోకి వచ్చింది. చేసేది ఒక ఉద్యోగమే అయినా రెండు వేతనాలు పొందుతూ దర్జాగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నాడు. ఒక వేతనాన్ని బ్యాంక్ అకౌంట్ ద్వారా, మరో వేతనాన్ని నేరుగా తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశాడు. 2009 నుంచి 2013 మార్చి వరకు ఖమ్మం ఎన్‌ఎస్‌పీలో ప్రతినెల *25 వేల నుంచి *30వేల వరకు వేతనం పొందుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అతనికి ఇష్టారాజ్యంగా మారింది. ఐదేళ్లనుంచి సుమారు *16లక్షల వరకు ఆ ఉద్యోగి వేతనం రూపేణా స్వాహా చేశాడు. పూర్తిస్థాయి వివరాల్లోకి వెళితే.. హుజూర్‌నగర్ ఎన్‌ఎస్‌పీ సబ్ డివి జన్‌లో ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగం చేసిన వెంకటకృష్ణ కొద్దికాలానికి వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందాడు. అంతేగాక అతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎన్‌ఎస్‌పీ ఉన్నతాధికారుల అండతోనే ఈ తతం గం జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
 
  అదేవిధంగా ఎన్‌ఎస్‌పీ శాఖలో అధికార పార్టీకి చెందిన ట్రేడ్‌యూనియన్ నాయకునిగా అధికారులను చేతిలో పెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఇప్పటికే పట్టణంలోని ఎన్‌ఎస్‌పీలో ఎన్‌ఎంఆర్‌ల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని, నియామకాలు సక్రమంగా లేవని ఇతర ప్రాం తాలకు చెందిన వారు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలుచేస్తున్నట్లు పట్టణానికి చెందిన పలు పార్టీల నాయకులు జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చివరకు ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిరోజుల్లోనే ఈ విషయం వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అంతేగాక సదరు ఉద్యోగి ఎన్‌ఎస్‌పీలో పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు తదితర బెనిఫిట్స్ ఫండ్‌ను సకాలంలో ఇప్పించడంలో మంచి పైరవీకారుడిగా కూడా ఖమ్మం ఎన్‌ఎస్‌పీ డివిజన్‌లో పేరు సంపాదించాడు.
 
 వెలుగు చూసిందిలా..
 ఖమ్మం ఎన్‌ఎస్‌పీ డివిజన్‌లో ఎన్‌ఎంఆర్‌లకు జీతాల చెల్లింపులో పలు అవతవకలు జరిగాయి. గతంలో కొందరు చనిపోయిన వారి పేరు మీద కూడా వేతనాలు డ్రా చేసి సుమారు *65లక్షల వరకు స్వాహా చేశారు. ఈ విషయానికి సంబంధించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఫైల్‌టు ఫైల్ ఆడిట్ నిర్వహించగా ఎన్‌ఎస్‌పీ వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటకృష్ణ *16లక్షలు స్వాహా చేసిన బాగోతం వెలుగు చూసింది. అయితే ఖమ్మం ఎన్‌ఎస్‌పీ డివిజన్ కార్యాలయంలో అవినీతికి సూత్రధారులుగా మానిటరింగ్ కార్యాలయంలోని సీని యర్  అసిస్టెంట్, సూపరింటెండెంట్‌ల పేర్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సూపరింటెండెంట్ రాజారావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులతో వెంకటకృష్ణకు గల సాన్నిహిత్యంతోనే అవినీతికి  పాల్పడేందుకు అవకాశం లభించినట్లు సదరు శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement