‘అన్నా’ ఇదేం క్యాంటీన్‌?

Officials Land Grab For Anna Canteene  - Sakshi

ప్రైవేటు స్థలంలో నిర్మాణానికి ప్రతిపాదన

యజమానుల ఆందోళన

వైఎస్సార్‌ సీపీ, జనసేన నాయకుల మద్దతు

ఉప్పాడలో ఉద్రిక్తత  

తూర్పుగోదావరి , కొత్తపల్లి (పిఠాపురం): ప్రభుత్వ స్థలానికి బదులు పేదలకు కేటాయించిన స్థలంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఉప్పాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప్పాడలోని చంద్రబాబు ఫిషర్‌మెన్‌ కమిటీ భవనం వద్ద ఎరిపల్లి తాతారావు, ఎరిపల్లి లక్ష్మణరావు, ఎరిపల్లి రాంబాబులకు 2002 జనవరి 8న ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ స్థలంలో అన్న క్యాంటీన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఆదివారం ప్రయత్నించారు. వారిని పట్టాదారులు అడ్డుకున్నారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ మాజీ సర్పంచ్, లబ్ధిదారుల తల్లి అప్పలకొండ కుటుంబ సభ్యులతో కలిసి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించింది. వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్, జనసేన నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు మాట్లాడుతూ, ప్రైవేటు స్థలంలో అన్న క్యాంటీన్‌ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్రభుత్వ స్థలాలుండగా, పట్టాలిచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించడం అధికార పార్టీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ తన ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పట్టాదారులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బాధితులకు మద్దతు తెలిపిన వారిలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, ఎంపీటీసీ సభ్యులు తోటకూర మారెమ్మ, ఉమ్మిడి జాన్, తొమ్మండ్ర సురేష్, సీహెచ్‌ ప్రసాద్, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, శేషుకుమారి తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top