ఆరు మాసాలకే సరి..

రూ.14.4 లక్షలతో 270   కుట్టుమిషన్ల కొనుగోలు

నియోజకవర్గానికో శిక్షణ కేంద్రం

అర్ధంతరంగా కేంద్రాలు మూసివేత

విజయనగరం: మహిళల అభ్యన్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నిధులు వెచ్చించడంలో ఉన్న శ్రద్ధ వాటిని సద్వినియోగపరుచుకుని, లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో చూపడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఉపాధి కల్పనలో భాగంగా మూడేళ్ల కిందట జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున తొమ్మిది కుట్టు శిక్షణకేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇందుకోసం రూ.14.40 లక్షలతో 270 కుట్టుమిషన్లు కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 కుట్టుమిషన్లు కేటాయించి శిక్షణ కేంద్రాలు తెరిచారు. పేదరిక నిర్మూలన సంస్థ కేటాయించిన నిధులతో గ్రామీణాభివృద్ది సంస్థ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే మూడు సంవత్సరాలలో కేవలం ఆరుమాసాలు నిర్వహించి శిక్షణ కేంద్రాలు నిలిపివేశారు. దీంతో ఆ కేంద్రాల్లో కుట్టు మిషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. 

ఒక్కో కేంద్రానికి రూ. 30 వేలు

నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వహణకు పేదరిక నిర్మూలన సంస్థ నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల చొప్పున మండల సమాఖ్యలకు డీఆర్డీలు విడుదల వేయాలి. ఆ నిధులతో శిక్షణకు అవసరమైన సామగ్రి కొనుగోలుతో పాటు శిక్షణ ఇచ్చే వారికి వేతనాలు ఇవ్వాలి. ఒక్కో కేంద్రంలో ఆరు నెలలపాటు నాలుగు బృందాలకు శిక్షణ అందించే అవకాశం ఉంది. ఏడాదికి కనీసం 2,600 మందికి ఉపాధి శిక్షణ ఇవ్వవచ్చు.

శిక్షణ అనంతరం మహిళలకు 50 శాతం రాయితీపై కుట్టు యంత్రాలను అందించాలి. కేంద్రాలు సక్రమంగానే నడుస్తున్న సమయంలో పేదరిక నిర్మూలన సంస్థ వద్ద నిధులు లేవనే కారణంతో పాటు ఇతర జిల్లాల్లో కేంద్రాలు నిలిపివేశారన్న సాకుతో జిల్లాలో కేంద్రాలను మూసివేశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే కుట్టు శిక్షణ కేంద్రాలను తెరిపించే విషయంలో అటు పాలకులు, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలోని 9 కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వాహణకు నెలకు రూ.2.82 లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.33 లక్షల నిధులు అవసరమవుతాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి 2,600 మందికి శిక్షణ ఇవ్వవచ్చు. ఎన్నో పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు 33 లక్షల రూపాయలు లేవనే సాకుతో కేంద్రాలు మూసివేయడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top