ఏపీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయం

NRC Will Not Implement In AP Says Anzad Basha - Sakshi

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

కర్నూలు (సెంట్రల్‌) : ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను  అమలు చేయబోమని ఉప ముఖ్యమంత్రి (రాష్ట్ర మైనార్టీ సంక్షేమం) అంజాద్‌బాషా తెలిపారు. శనివారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలసి ముస్లిం పెద్దలు, ప్రజా సంఘాల నాయకులకు ఎన్‌ఆర్‌సీపై గల సందేహాలను నివృత్తి చేశారు. మొదట రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజాద్‌బాషా మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీపై దేశంలోని ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేయాలన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్‌ఆర్‌సీని అడ్డుపెట్టుకుని అలజడి సృష్టించేందుకు చూస్తున్నాయని, అలాంటి వారిపై నిఘా ఉంచామని చెప్పారు. ఎన్‌ఆర్‌సీని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు శాంతియుతంగా నిరసన తెలపడం అభినందనీయమన్నారు. కాగా, కొందరు ముస్లిం పెద్దలు ఎన్‌పీఆర్‌ని వ్యతిరేకించాలని కోరగా.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్‌ సీపీకి వెన్నెముక అని, వారికి అన్యాయం జరిగే ఏ పనికీ ప్రభుత్వం మద్దతు తెలపదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, నాయకుడు ఆదిమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top