డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ జారీ

Notification For Departmental Exams - Sakshi

వచ్చే నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి

జూన్‌ 7 నుంచి 12వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో పరీక్షలు

మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీపీఎస్‌సీ

నిడమర్రు : ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీకాలంలో బదిలీకి/పదోన్నతికి అదే శాఖలో లేదా ఇతర శాఖల్లోకి అవకాశం వచ్చిన సందర్భాల్లో తగిన అర్హత పొందేందుకు ఆ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ శాఖాపరమైన పరీక్షలు (డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌) రాసి ఉత్తీర్ణత సాధిం చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన  నోటిఫికేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ద్వారా విడుదలైంది. ప్రభుత్వం లోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్‌ కోడ్‌లతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వచ్చే నెల 14వ తేదీ వరకూ అవకాశం ఉంది. జూన్‌ 7 నుంచి 12 వరకూ ఈ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయాల్సి ఉంది. ఈ డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ఉపాధ్యాయులు జీవో మరియు ఈవో పరీక్షలు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.

ఆ వివరాలు మీకోసం..ఉత్తీర్ణత మార్కులు ఇలా..
డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందాలంటే, ప్రతీ పరీక్షలోనూ వంద మార్కులకు 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతీ పరీక్షలోను 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది.

సిలబస్‌ ఇలా..
జీవో పరీక్ష పేపర్‌–1 (కోడ్‌: 88) సిలబస్‌: ఇన్‌స్పెక్షన్‌ కోడ్స్, ది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోడ్స్, ఎలిమెంట్రీ స్కూల్‌ రూల్స్, పీఎఫ్‌ రూల్స్‌ ఫర్‌ నాన్‌–పెన్షనబుల్‌ సర్వీస్‌లతోపాటు వర్తమాన అంశాలు ప్రిపేర్‌ అవ్వాల్సి ఉంది.
పేపర్‌–2(కోడ్‌: 97) సిలబస్‌: ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం–1994, ఏపీ పాఠశాల విద్య సర్వీస్‌ నిబంధనలు, ఏపీ సీసీఏ రూల్స్‌ ఏపీ మండల ప్రజాపరిషత్‌ చట్టం, ఏపీ ఓఎస్‌ఎస్‌ వీటితో పాటుగా వర్తమాన అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి.
ఈవో పరీక్ష (కోడ్‌: 141) సిలబస్‌: ఏపీ బడ్జెట్‌ మాన్యువల్, ఏపీ ఖజానా శాఖ కోడ్స్, ఏపీ పింఛన్‌ కోడ్, భారత నిర్మాణం వీటితోపాటుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌),  పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్‌ అవ్వాల్సి ఉంది.

పరీక్ష ఫీజు వివరాలు ఇలా..
ప్రతీ పేపర్‌కూ రూ.200 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీవో టెస్ట్‌కు రెండు పేపర్లకు రూ.400, ఈవో టెస్ట్‌కు రూ.200 చొప్పున పరీక్ష ఫీజుగా చెల్లించాలి. అలానే ప్రతీ పరీక్షకు రూ.500 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. అదే జీవో, ఈవో పరీక్షలు ఒకే సెషన్‌లో రాసేందుకు దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజు రూ.500 మాత్రమే చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..
డిపార్ట్‌మెంట్‌ పరీక్షా విధానం 2016 నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి మార్పు అయింది. పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష రాసే విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మార్పు చేయబడ్డాయి. నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఈ పరీక్షలు రాసేందుకు వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో ఉద్యోగిని వివరాలు నమోదు చేసుకోవల్సి ఉంది. అనంతరం ఏ పరీక్ష రాస్తున్నారో వాటికి అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

వెబ్‌సైట్‌ : www.prcap.com లో డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ కాలం క్లిక్‌ చేసి మరింత సమాచారం పొందవచ్చు.
పరీక్ష తేదీలు
జీవో (కోడ్‌ 88 అండ్‌ 97): పేపర్‌–1 జూన్‌ 9వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, పేపర్‌–2 అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది.
ఈవో (కోడ్‌ 141): జూన్‌ 10వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. అదే రోజు తెలుగు భాష హయ్యర్‌ పరీక్ష (కోడ్‌ 37) మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ జరుగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top