భగీరథయత్నం!


 భద్రాచలం రూరల్,న్యూస్‌లైన్:  గోదావరి నదిలో నీటిచుక్క కనపడక ఎడారిని తలపిస్తోంది. దీంతో పంటలకు తడులు పెట్టేందుకు అవకాశం లేక రైతులు  సాగునీటికోసం  భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.



 భద్రాచలం మండల పరిధిలో రైతులు ఈ ఏడాది దాదాపు 2వేల హెక్టార్లకు పైగా మిర్చి పంటను  సాగు చేస్తున్నారు. పత్తి పంట వరదలకు.., మినుము,పెసర,ఇతర పంటలు తుపానుకారణంగా  నష్ట పోవడంతో రైతులు ఈ ఏడాది మిర్చిసాగుపై ఆశలు పెట్టుకున్నారు. టీపీ వీడు గ్రామం నుంచి మురుమూరు వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు 1000 ఎకరాలకు మించి మిర్చిని సాగుచేస్తున్నారు. ఈ పంటలకు తడులు పెట్టేందుకు ప్రతీ ఏటా గోదావరి నీటిని ఉపయోగించుకుంటారు.



 అయితే ప్రస్తుతం ఈ పరివాహక ప్రాంతంలో గోదావరిలో నీరు లేక ఎడారిగా మారింది. ప్రతి వర్షాకాలం తర్వాత  దేవరపల్లి గుట్ట నుంచి మురుమూరు గుట్ట వరకు గోదావరి రెండు పాయలుగా విడిపోతుంది. ఈ రెండో పాయ క్రమేపీ నీటి ప్రవాహం తగ్గి డిసెంబర్ నెల వచ్చేనాటికి నీటి మడుగులు మిగులుతాయి. ఈసారి ఫిబ్రవరి నెలలోనే గోదావరిలోని నీటి మడుగులు కూడా ఎండిపోవడం రైతులకు శాపంగా మారింది. ఏప్రిల్ నెల వరకు మిర్చి తోటలకు తడులు ఎలా పెట్టేదంటూ ఈ ప్రాంత రైతులు దిగాలు పడుతున్నారు.



 నీటి కోసం అష్ట కష్టాలు...

 ఏలాగైనా పంటను కాపాడుకోవాలని పట్టుదలతో కొందరు రైతులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  గోదావరి ఇసుకలో 20 అడుగులు, వాగుల్లో 30 అడుగుల మేర బావులను తవ్వుకుని సిమెంట్ ఒరలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బావుల్లో ఊట నీటినే ప్రస్తుతం మిర్చి తోటలకు తడులుగా ఉపయోగిస్తున్నారు. ఈవిధంగా ఒక్కో బావి తవ్వేందుకు సుమారు రూ.10 వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. అయితే బావులలోని నీరు కూడా మిర్చి తోటలకు చాలదనే దిగులు రైతులకు పట్టుకుంది.  గత మూడేళ్ల నుంచి ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్ట పోయామని, ఆదుకున్న వారు లేరని,   ఈఏడాదీ దిగుబడులు రాక అదేపరిస్థితి ఏర్పడుతుందనే భయం వెంటాడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top