నారావారి రాజ్యం.. మహిళకు మరణ శాసనం

No Safety For Women in TDP Government - Sakshi

‘‘నిర్భయ చట్టాన్ని, గృహహింస చట్టాన్ని, ఇతర మహిళా రక్షణ చట్టాలను కఠినంగా అమలుచేసి విద్యార్థినులపై, మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టవేస్తాం. జీపీఎస్‌ టెక్నాలజీ ద్వారాప్రమాదంలో ఉన్న మహిళలకు 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను తెస్తాం.మహిళల రక్షణకు ప్రత్యేక పోలీస్‌ విభాగాన్ని (ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) ఏర్పాటుచేస్తాం’’ – 2014 ఎన్నిలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. 

అక్కడితో ఆగలేదు..
చంద్రబాబు ఉన్నప్పుడు అసలు భయమనేదే లేదు. ఆయన వస్తేనే బాగుంటుందండి. అవునుఆయనొస్తున్నాడు’’– అంటూ 2014 ఎన్నికల సమయంలో టీవీ యాడ్‌లతో ఊదరగొట్టారు.‘‘మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. బాలికపై చేయి వేయాలంటే భయపడేపరిస్థితిని తీసుకొస్తాం. చట్టాలు కఠినంగా అమలుచేస్తాం’’ అంటూ చంద్రబాబు హడావుడి చేశారు. 

సీన్‌ కట్‌ చేస్తే... 2018
చంద్రబాబు పాలనలో.. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం – మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 8వ స్థానంలో ఉంది.దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరుగుతుండగా..ఏపీలో మాత్రం ప్రతిలక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలుచోటుచేసుకుంటున్నాయని.. నీతి ఆయోగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  
బీహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలుఅధికమనే చేదు నిజం గతేడాది రాష్ట్ర ప్రభుత్వాలతో ‘నీతి ఆయోగ్‌’నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైంది! 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మహిళలందరి భద్రతకు నాది భరోసా.. అంటూ నమ్మబలికి 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆ తర్వాత కూడా మహిళలు, బాలికల భద్రతపై అనేక వేదికలపై, సభల్లో చంద్రబాబు ఉపన్యాసాలు దంచేశారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత తనదేనన్నారు. మరి ఈ రోజు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఉందా? కనీసం పట్టపగలైనా ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా?! అంటే.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందనేది వార్షిక క్రైమ్‌ నివేదికలే బట్టబయలు చేస్తున్నాయి. రాష్ట్రంలో  గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇందులో చాలావరకు స్వయంగా చంద్రబాబు పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులే దారుణాలకు పాల్పడుతుండటం తెలిసిందే. ఓవైపు మహిళకు రక్షణగా నిలవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అబలలపై దాడులు, వేధింపులు, దౌర్జన్యాలకు దిగుతుంటే... నేరాలకు పాల్పడుతున్న తమ నాయకులను కాపాడేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుండటం నిర్ఘాంత పరుస్తోంది. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీయేటా మహిళలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. చంద్రబాబు పాలనలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. సర్పంచ్‌ నుంచి జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడి దాకా.. సాగిస్తున్న దౌర్జన్యకాండకు అడ్డూ అదుపులేకుండా పోయింది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెట్రేగిపోయిన ఘటనల్లో ప్రభుత్వ అధికారులు సైతం బాధితులుగానే మిగిలారు.

గత ఐదేళ్లలో మన కళ్లముందే.. మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయి..
ముఖ్యంగా ర్యాగింగ్‌ భూతం, లైగింక వేధింపులకు బలైన ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి..
ప్రొఫెసర్ల వేధింపులతో వైద్య విద్యార్థిని సంధ్యారాణి బలవన్మరణం..
లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జూనియర్‌ డాక్టర్‌ శిల్ప..  
టీడీపీ నేతల దన్నుతో అమాయక మహిళలను వ్యభిచారంలోకి నెట్టిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌..
ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని దాడి..  
ఇలా చెప్పుకుంటూపోతే.. గత ఐదేళ్ల నారా వారి పాలనలో.. ఎక్కడ చూసినా అబలలపై అకృత్యాలే..

మహిళలపై నేరాల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టాప్‌– నిగ్గు తేల్చిన ఏడీఆర్‌ నివేదిక
ఏపీలో ఆడబిడ్డలపై పెచ్చుమీరిన ‘పచ్చ’ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయి సంస్థలు నిగ్గుతేల్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాగించిన కీచకపర్వాలను స్వచ్చంద సంస్థలు బట్టబయలు చేశాయి. మహిళలపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన వారి గురించి ప్రపంచానికి చాటాయి. ‘మహిళలపై నేరాల కేసుల్లో చట్టసభ్యులు’ అనే అంశంపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), జాతీయ ఎన్నికల పరిశీలన స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేసిన నివేదికను గతేడాది వెల్లడించాయి. రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ప్రజాప్రతినిధులు మహిళలపై పాల్పడ్డ నేరాలకుగానూ నమోదైన కేసులను నివేదికలో స్పష్టం చేసాయి. ఇక మహిళలపై దాడులకు పాల్పడిన కేసుల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

మహిళలను అగౌరవ పర్చడంలో రాష్ట్రం ఫస్ట్‌
గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం– తొలి పది స్థానాల్లో ఏపీ ఉండటం గమనార్హం. అందులోను మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే 8వ స్థానంలో ఉంది. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అనే నినాదం బస్సుల్లోను, గోడలపైన రాతలకే పరిమితం అవుతోంది. మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉందని ఇటీవల జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) రిపోర్టు తేటతెల్లం చేసింది. మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, బహుభార్యత్వం, మహిళల కిడ్నాప్‌లు, గృహహింస.. ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం. గడిచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాలే 44,780 కేసులు ఉన్నాయి. 2014 నుంచి 2018 వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ప్రతి యేటా పెరుగుతూనే ఉన్నాయి. 

మరెవరికీ ఇలాంటి కడుపు కోత వద్దు
మా కుమార్తె రిషితేశ్వరి 2015 జూలై 14వ తేదీన ఏఎన్‌యూలో హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాబూరావుతో పాటు, కొందరు సీనియర్‌ విద్యార్థుల వేధింపుల వల్లే మా పాప ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె డైరీలో పది పేజీలకు పైగా సూసైడ్‌ నోట్‌ రాసింది. అప్పట్లో న్యాయం కోసం కొన్ని నెలలు పోరాటం చేసిన తర్వాత ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరాం. అయితే ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మేము కాకినాడలో ఉంటున్నాం. నాలుగేళ్లుగా గుంటూరు కోర్టుకు న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాం. కేసును త్వరితగతిన విచారించి మా కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. మరే తల్లిదండ్రులకు ఇలాంటి కడుపు కోత రాకుండా చర్యలు తీసుకోవాలి.  – రిషితేశ్వరి తల్లిదండ్రులు

వేధింపులకు బలైన రిషితేశ్వరి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్‌ భూతం, లైగింక వేధింపులతో తీవ్ర అవమానభారంతో ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి 2015 జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం. రిటైర్డ్‌ ఐఏఎస్‌ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ సైతం ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక సమర్పించింది. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ బాబూరావు కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. బాబూరావు అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు నివేదికలో పేర్కొంది. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విచారణ కమిటీ సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం కన్నా గట్టి చట్టం తీసుకురావాలని నివేదికలో సూచించింది. రిషితేశ్వరి ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో చంద్రబాబు అప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం.. దోషులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకుంది. 

సిట్‌తో శిల్ప కేసు దారి మళ్లింపు..
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జూనియర్‌ డాక్టర్‌ శిల్ప 2015–16లో తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో పీజీలో చేరింది. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ 2017 ఏప్రిల్‌లో శిల్ప ఈ–మెయిల్‌లో గవర్నర్‌ నరసింహన్, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఈ విషయంపై విచారించాలంటూ విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ వీసీని గవర్నర్‌ ఆదేశించారు. దీనిపై తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో శిల్ప ఆరోపణల్లో నిజంలేదని నివేదిక ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లు పనిచేసే మెడికల్‌ కాలేజీ నుంచే కమిటీ వేస్తే.. నిజాలు వెలుగులోకి రావనే లాజిక్‌ను ప్రభుత్వం విస్మరించింది. వేధింపులు ఆగకపోవడంతో జూనియర్‌ డాక్టర్‌ శిల్ప డిపార్టుమెంట్‌కు సంబంధంలేని వారితో విచారణ చేయించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తిరుపతి సబ్‌కలెక్టర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ వేసిన కమిటీ నాలుగు నెలలైనా వాస్తవాలు వెల్లడించలేదు.ఈలోపే వచ్చిన పీజీ ఫలితాల్లో థియరీలో ఉత్తీర్ణత సాధించిన ఆమె.. ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ అయ్యింది. తమపై ఫిర్యాదు చేసిందనే కక్షతోనే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ చేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన శిల్ప 2018,ఆగస్టు7న పీలేరులో ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప మరణానికి ప్రభుత్వమే కారణమంటూ అప్పట్లో విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత శిల్ప కేసును సిట్‌ పేరుతో దారి మళ్లించారు. లైంగిక వేధింపులపై ఆమె ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం స్పందించి ఉంటే శిల్ప ప్రాణం దక్కేదని ఆమె బంధువులు, తోటి జూనియర్‌ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంధ్యారాణి ప్రాణం తీసిన ప్రొఫెసర్ల వేధింపులు
గుంటూరులో ప్రొఫెసర్ల వేధింపులు మెడికో సంధ్యారాణి ప్రాణం తీశాయి. 2016లో వైద్య విద్యార్థిని సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన ప్రొఫెసర్‌ లక్ష్మి, ఆమె భర్త విజయసారథిని కాపాడేందుకు టీడీపీ కీలక నేతలే ప్రయత్నాలు చేయడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సంధ్యారాణి ఆత్మహత్య అనంతరం ప్రొఫెసర్‌ లక్ష్మి, ఆమె భర్త విజయసారథి తప్పించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు 23 ప్రాంతాలకు వెళ్లినట్టు పోలీసులు అప్పట్లో నిర్ధారించారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం తాత్కాలికంగా హడావుడి చేసిందే తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది.

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు టీడీపీ నేతల దన్ను
అధికార తెలుగుదేశం పార్టీ నేతల దన్నుతో రాజధాని ప్రాంతమైన విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. 2015 డిసెంబర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారంలో.. కీలక సూత్రధారులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉండటంతో పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదు. చివరకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో దోషులను అరెస్టు చేయక తప్పలేదు. అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు, వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నకాల్‌మనీ(అధిక వడ్డీలకు అప్పులిచ్చే) ముఠాకు ఆర్థిక వనరులుసమకూర్చుతున్నది అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులేననితేలడంతో కొందరిని అరెస్టు చేసి.. కేసును మూసేయడం గమనార్హం.

మహిళా తహసీల్దార్‌పైచింతమనేని దౌర్జన్యం
తమ్మిలేరులో అక్రమంగా ఇసుక తవ్వి తరలించుకుపోతున్న మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై.. టీడీపీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ 2015 దాడి ఘటన అప్పట్లో సంచలనం రేపింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మితిమీరాయి.  కాగా, సచివాలయం సాక్షిగా ఒక మహిళా అధికారిని లైంగికంగా వేధించిన మరో మంత్రిపైన, రాష్ట్రంలో మహిళపై దాడులు, వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలపైన.. చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా చంద్రబాబు సర్కారు ఉదాసీన వైఖరి కారణంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు,ఘోరాలు పెరగడానికి ఊతమిచ్చినట్టు అయ్యిందని ప్రజానీకం అంటోంది.

రాష్ట్రంలో చింతమనేని టాప్‌
అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఏకంగా 23 కేసులు నమోదైనట్టు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. వాటిలో తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నవి 13 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మొత్తం 75 సెక్షన్ల కింద అభియోగాలున్నాయి.  
రాష్ట్ర మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుపై 13 కేసులు నమోదు కాగా, అందులో ఒకటి తీవ్రమైన కేసు. మొత్తం 42 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.  
మరో మంత్రి అచ్చెన్నాయుడుపై 3 అభియోగాల కింద ఒక కేసు నమోదైంది.  
విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై నాలుగు కేసులున్నాయి. వీటిల్లో ఐపీసీకి సంబంధించి మొత్తం 21 సెక్షన్ల కింద కేసులు         నమోదయ్యాయి.  
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారయణ (వరదాపురం సూరి)పై మొత్తం 10 కేసులుండగా.. 8 తీవ్రమైన కేసులు. దేశవ్యాప్తంగా రేప్‌ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న వారు ముగ్గురు సభ్యులు ఉండగా.. అందులో ధర్మవరం ఎమ్మెల్యే ఒకరు. వీరిపై మహిళా వేధింపుల కేసులే కాకుండా.. మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక స్పష్టం చేసింది.

మచ్చుకుమరికొన్నినేరాలు,ఘోరాలు
తమ్మిలేరులో ఇసుక మాఫియాను నిజాయితీగా విధులు నిర్వర్తించి 2015 జూలై 8న అడ్డుకున్న మహిళా తహసిల్దార్‌ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన అనుచరులతో దాడిచేసి ఏళ్లు గడిచినా.. కనీస చర్యలు తీసుకోని చంద్రబాబు సర్కారు ఆమెకు న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమైంది.

చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు తహసిల్దార్‌ నారాయణమ్మపై 2015 జూలైలో టీడీపీ బలపరిచిన సర్పంచ్‌ రమణారెడ్డి, తన అనునయులతో కలిసి దాడి చేసి దుర్బాషలాడినా చంద్రబాబు సర్కారు కనీసం స్పందించలేదు.  

అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత పర్యటనలో నిరసన తెలిపిన మహిళలపై మంత్రి సోదరుడు మురళీ తన ప్రతాపం చూపించడంతో  మహిళలకు తీవ్ర గాయాలుకావడం బాధాకరం.

అనంతపురం రూరల్‌ పూలకుంట గ్రామంలో రెచ్చిపోయిన అధికారపార్టీ నాయకులు ఒంటరిగా నివసిస్తున్న మహిళ కవితపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంరేపింది. బాధితురాలు ఇటుకలపల్లి పోలీసులనుఆశ్రయించి మొరపెట్టుకుని లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.. జనచైతన్య యాత్ర సమయంలో నిరసన తెలిపిన మహిళలపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టడం సంచలనం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్లుగా కొనసాగిన అనేక టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు అంతేలేదు.  

తన ఇంటి వద్ద తొట్టె కడుతున్నందుకు ప్రశ్నించిందన్న అక్కసుతో అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లిలో సుధమ్మ అనే మహిళపై సర్పంచ్‌ నాగరాజు, జన్మభూమి కమిటీ నాయకుడు చంద్ర కలిసి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టి దారుణంగా దుర్బాషలాడుతూ దుశ్శాశన పర్వాన్ని తలపించారు. కంటి చూపు కూడా సరిగా లేని ఒంటరి మహిళ సుధమ్మను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అనుచరుడైన నాగరాజు చేసిన ఈ అకృత్యం దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వీడియోగా హల్‌ చల్‌ చేసినా కనీస చర్యలు లేవు. ఇంత జరిగితే.. ’అయ్యా..న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్‌ ఇచ్చి పంపించేశారు.

కిడ్నాప్‌లు.. రేప్‌లుభయపెడుతున్నాయి
రాజధానిలోని గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు జిల్లాలోనుకిడ్నాప్‌లు, రేప్‌లు ఆందోళనకలిగిస్తున్నాయి. ఇక అత్యాచార కేసుల్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లోనిలిచాయి. గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చిన్నారులపై దాడులు, లైంగిక దాడులు పోలీసులకు సవాలుగా మారాయి.

నీతి ఆయోగ్‌ నివేదికలోను నివ్వెరపరిచే నిజాలు..: ఏపీలో మహిళలపై నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదని, దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగుతున్నాయంటూ.. నీతి ఆయోగ్‌ నివ్వెరపరిచే నిజాలు వెల్లడించింది. దేశంలో ప్రతీ లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరుగుతుండగా, ఏపీలో మాత్రం ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మహిళలపై ప్రధానంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top