బస్సెళ్లిపోయి.. పదేళ్లు.!  | Sakshi
Sakshi News home page

బస్సెళ్లిపోయి.. పదేళ్లు.! 

Published Tue, Nov 26 2019 10:13 AM

No Rtc Bus Facility In Villages - Sakshi

సాక్షి, ప్రతినిధి విజయనగరం: జిల్లాలో సుమారు 154  గ్రామాల ప్రజలు ఆర్టీసీ సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యాలయాలకు వెళ్లాలన్నా.. కార్యాలయాలకు చేరుకోవాలన్నా.. మార్కెట్‌కు బయలుదేరాలన్నా.. ఆపద సమయంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఆటోలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి. అవి కూడా సాయంత్రం 5 గంటలతో సరి. అందుకే.. పొద్దుపోతే చాలు ఆ గ్రామాల ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు ఆతృతపడతారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ఆర్టీసీ విఫలమవుతోందని, వ్యాపార దృక్పథంతో ఆదాయం వచ్చే మార్గాల్లోనే బస్సు లు నడువుతోందని ఆ ప్రాంతాల ప్రజల వాదన.

 ఆదాయం లేకపోతే ఆపేస్తారు..  
జిల్లాలో 24 లక్షలకుపైగా జనాభా ఉండగా వీటిలో 60 శాతం  గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వీరికి రవాణా సేవల అందించడానికి ఆర్టీసీ సంస్థ జిల్లాలోని నాలుగు డిపోల ద్వారా 226 పల్లెవెలుగు బస్సులతో మాత్రమే సర్వీసులు నిర్వహిస్తోంది. వీటిలో 80 అద్దె బస్సులు ఉన్నాయి. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 704 గ్రామాలకు పక్కా రహదారులు ఉన్నా  వాటిలోని 650 గ్రామాలను కలిపే ‘పల్లెవెలుగు’ సర్వీసులను మాత్రమే ప్రస్తుతం నడుపుతోంది. జిల్లాలో రోడ్డు సౌకర్యం ఉన్న దాదాపు 154 గ్రామాలకు ఆర్టీసీ సేవలను అందించడం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్నామని చెబుతున్న 650 పల్లెవెలుగు సర్వీసులలో 60 రూట్ల సర్వీసులను ఎప్పటికప్పుడు రద్దు చేస్తుండడంతో ఆ ప్రాంతాల ప్రజలకు ఆర్టీసీ సేవలు దూరమవుతున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని బస్సులు నడపడం లేదని చెబుతూ వచ్చిన ఆర్టీసీ అధికారులు ఇప్పుడు లాభాలు రావడం లేదన్న కారణం చూపుతున్నారు.

 93 పల్లె వెలుగుల్లో గ్రామాలకు వెళ్లేవి 10 మాత్రమే..  
విజయనగరం డిపో పరిధిలో 144 బస్సులతో 42 రూట్లలో 146 సర్వీసులను ఆర్టీసీ సేవలను అందిస్తోంది.  వీటిలో 59 బస్సులు వరకు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయి. 30 ఎక్స్‌ప్రెస్, 18 డీలెక్స్, 3 సూపర్‌ లగ్జరీ సర్వీసులు అంతర రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రధాన రోడ్లలో ప్రయాణికులు డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి. మిగిలినవి దాదాపు 93 వరకు పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామాలకు వెళ్లకుండా వీటిని కూడా ప్రధాన రహదారుల పట్టణాలకు పరిమితం చేస్తున్నారు. పట్టణానికి ఆనుకొని ఉన్న కొన్ని మండలాల్లోని వసంత, పెంటసీతారాంపురం, గోవిందపురం, కోనాడ వంటి కొన్ని గ్రామాలకు వెళ్లే 10 బస్సులు మినహా మిగిలిన 83 పల్లె వెలుగులు సర్వీసలన్నీ ఆదాయాన్నిచ్చే పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రాజాం, ఎస్‌.కోట వంటి దూరప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో డిపో పరిధిలోని 80 శాతం గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందడం లేదు.

 విద్యార్థులు, ఉద్యోగులకు ఆటోలే దిక్కు: 
పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడిబస్సు పేరుతో ప్రధాన పట్టణాలను కలిపే సర్వీసులు 10 బస్సులు జిల్లాలో నడుస్తున్నా యి. గ్రామాలకు తిరిగే బస్సులను  రద్దు చేసి.. వాటి స్థానంలో బడి బస్సులు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి బస్సుపాసు తీసుకునే వారు 40 వేలకు పైడా ఉండగా కేవలం 10 బస్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. పైగా ఈ బస్సులు సైతం  సమయపాలన పాటించడం లేదని, ఇతర ప్రయాణికులను కూడా ఎక్కించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.  

ప్రతిపాదనలు పంపాం  
రోడ్లు పక్కాగా ఉన్నా  రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కొన్ని గ్రామాల సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. ఆరునెలలుగా సర్వీసులను రద్దు చేయలేదు. ఆటోలు, ఇతర ప్రై వేటు వాహనాలు గ్రామాలకు అక్రమ రాకపోకలు ఎక్కువయ్యాయి. వాటిని నిరోధిస్తే ఆర్టీసీకి ఆధరణను పెంచుకోవచ్చు. ఉన్న బస్సుల కంటే అధనంగా రూట్లకు అనుమతులు కోసం ఎప్పటికప్పుడు ఏడాదికోసారి ప్రతిపాదనలు పంపుతాం.  
– ఏ.అప్పలరాజు, ఆర్‌ఎం, ఆర్టీసీ నెక్‌ రీజయన్‌  

Advertisement
Advertisement