నిలదీస్తే.. వేధింపులా?

No Jobs For Andhrapradesh Youth in KIA industry - Sakshi

కియాలో ఉద్యోగం మిథ్య

భూ నిర్వాసితులకు దక్కని కొలువు

హామీపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం

రైతు, రైతు కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జోక్యంతో వదిలిపెట్టిన వైనం

కియా కార్ల తయారీ పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన వారి కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. స్థానికులకు, నిర్వాసిత కుటుంబాల వారికి కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలు కట్టబెట్టారు. ‘కియా’లో ఉద్యోగం మిథ్యగా మారిన నేపథ్యంలో సహనం కోల్పోయిన ఓ రైతు బిడ్డ ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను నిలదీశాడు. అంతే ఆయన ఆగ్రహిస్తూ చిందులేశారు. వారం తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని వేధింపులకు గురి చేశారు.

అనంతపురం , పెనుకొండ రూరల్‌: పెనుకొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన అంజనరెడ్డి కియా పరిశ్రమకు రెండు ఎకరాల పొలాన్ని ఇచ్చాడు. సేకరణ సమయంలో భూ నిర్వాసిత కుటుంబంలో పిల్లలకు అర్హతను బట్టి కియాలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే తమ పొలం పోయినా ఎంసీఏ వరకు చదువుకున్న కుమారుడ వెంకటరెడ్డికి స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని రైతు ఆనంద పడ్డాడు. నెలలు గడిచిపోతున్నా ఎటువంటి సమాచారమూ లేకపోవడంతో క్రమక్రమంగా వారిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పెనుకొండ మండలం మోటువారిపల్లి నుంచి అనంతపురం వెళ్తూ అమ్మవారుపల్లిలోకి వచ్చిన ఎమ్మెల్యే బీకే పార్థసారథిని గ్రామస్తులు, భూ నిర్వాసితుల కుటుంబాలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూమి కోల్పోయిన రైతు అంజనరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి తమకు కియా పరిశ్రమలో ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదం చేశాడు. ఈ సమయంలో ‘నువ్వు రెడ్డివి కాబట్టే ప్రశ్నిస్తున్నావ్‌’ అంటూ ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగి దూషించాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అమ్మవారుపల్లికెళ్లి వెంకటరెడ్డిని, అతని తండ్రి అంజనరెడ్డిని అదుపులోకి తీసుకుని పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

బాధితులకు శంకరనారాయణ బాసట  
పోలీసుల అదుపులో ఉన్న రైతు అంజనరెడ్డి, కుమారుడు వెంకటరెడ్డిని మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. అక్కడ ఉన్న ఏఎస్‌ఐ సిద్దయ్యతో బాధితుల విషయంపై చర్చించారు. కియా పరిశ్రమకు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఇలా స్టేషన్‌ల చుట్టూ తిప్పుకోవడం, వారిని వేధించడం ఏమిటని వాగ్వాదం చేశారు. అనంతరం పోలీసుల అదుపులో ఉన్న రైతు, ఆయన తనయుడిని విడిపించారు.

రైతు కుటుంబాలను వేధించడం తగదు
కియా పరిశ్రమ కోసం దాదాపు 400 మంది రైతులు అతి తక్కువ రేటుకు భూములు ఇచ్చారని, అయితే చదును పేరుతో ఎకరాకు రూ.30 లక్షల మేర ఖర్చు పెట్టిన ప్రభుత్వం నిర్వాసిత రైతు కుటుంబాలను వేధించడం ఎంతవరకు సమంజసమని శంకరనారాయణ విలేకరుల సమావేశంలో అన్నారు. కియా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇతర ప్రాంతాల వారికి ప్రత్యేకించి చెన్నై వారికి అధిక సంఖ్యలో ఉద్యోగాలు కేటాయిస్తున్నారన్నారు. స్థానిక రైతు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అడిగిన పాపానికి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగి, అరెస్టులు చేయించడం పద్ధతి కాదన్నారు.

ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు?
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కియా పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం భూమి కోల్పోయిన కుటుంబాలు కానీ, స్థానికులు కానీ కియా పరిశ్రమలో దిన కూలీలుగా కార్మికులుగా, మహిళలైతే హౌస్‌కీపింగ్‌ లాంటి చిన్నచిన్న ఉద్యోగాలే కేటాయిస్తున్నారు. వారం రోజుల్లోపు కియా పరిశ్రమకు భూములిచ్చిన రైతు కుటుంబాలకు, స్థానిక యువతకు కియా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ తరఫున పరిశ్రమ ఎదుట భూ నిర్వాసిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ మునిమడుగు శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ నాగలూరు బాబు పాల్గొన్నారు.   

శంకరనారాయణపై నిఘా
పెనుకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఆయన ఇంటి చుట్టూ మఫ్టీలో ఉన్న పోలీసులు మొహరించారు. అంతేకాకుండా ఆయన్ను అనుసరించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించారు. మంగళవారం శంకర్‌నారాయణ మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో ‘‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’’,  ‘‘నిన్ను నమ్మం బాబూ’’ కార్యక్రమాల్లో పాల్గొనగా ఆ ఇద్దరు పోలీసులు ఆయన్ను అనుసరించారు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లారు. సీఎం రాక నేపథ్యంలో ఏవైనా ఆందోళనలు, నిరసనలు చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top