కర్నూలు ఉల్లి.. కొనుగోలు నిల్‌ | No Demand For Kurnool Onions in Tadepalligudem | Sakshi
Sakshi News home page

కర్నూలు ఉల్లి.. కొనుగోలు నిల్‌

May 11 2020 1:34 PM | Updated on May 11 2020 1:34 PM

No Demand For Kurnool Onions in Tadepalligudem - Sakshi

కర్నూలు ఉల్లి పాయలు

తాడేపల్లిగూడెం: మార్కెట్‌లో కర్నూలు ఉల్లి రకం నేలచూపులు చూస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిపాయలతో పోటీని తట్టుకోలేక ధర దారుణంగా పడిపోయింది. ఎన్నడూలేని విధంగా తాడేపల్లిగూడెం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.130కి చేరింది. దీంతో రిటైల్‌గా కిలో రూ.1.30 పలికింది. ఇంతవరకూ క్వింటాలు గరిష్టంగా రూ. 500 మాత్రమే పలికింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చే ఉల్లిపాయలతో పోలిస్తే కర్నూలు ఉల్లి నాణ్యంగా లేక పోవడం, నిల్వకు ఆగకపోవడం కారణంగా వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి ధర అమాంతం పడిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఉల్లిపాయలు క్వింటాలు ధర రూ.600 నుంచి రూ.1350 వరకు అమ్మారు. ప్రస్తుతం రూ.600 నుంచి రూ.1000 మధ్య ఉంది.

వాతావరణ మార్పులతో నష్టం
ఈ సారి వేసవిలో (రెండో పంట) ఉల్లికి మంచి ధర వస్తుందని కర్నూలు రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. చేతికొచ్చేనాటికి వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలతో పంట దెబ్బతింది. నిల్వకు ఆగని రకంగా పేరున్న ఈ ఉల్లిపాయలు వాతావరణం వల్ల తొక్క ఊడిపోవడం, పెరిగిన ఎండలతో ఉల్లి లోపల ఉడికిపోవడంతో మార్కెట్‌కు వచ్చినా కొనే వారు లేక ధరలు పడిపోయాయి. కర్నూలు ఉల్లి రైతుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం గిట్టుబాటు కల్పించేలా క్వింటాలు రూ.770 వంతున కొని జిల్లాలకు పంపించింది. కర్నూలుతో పాటు, ఈ ఉల్లికి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడెం పంపారు. ఇక్కడి మార్కెట్‌కు కర్నూలు ఉల్లి కంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఉల్లి రావడంతో కర్నూలు ఉల్లిని వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో క్వింటాలు ధర రూ.130కి పడిపోయింది. 

మార్క్‌ఫెడ్‌ ద్వారా 5700 క్వింటాళ్ల కొనుగోలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా 5700 టన్నుల ఉల్లిని క్వింటాలు రూ.770కి కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. సరాసరి కిలోకు రూ.2 వరకు కిరాయి ఇచ్చి జిల్లాకు సరుకును పంపించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని కిలో రూ.3, గరిష్టంగా రూ. 5కి విక్రయించారు. అయినా సరుకు అమ్ముడిపోని పరిస్థితి. మొత్తం సరుకును ఆదివారం మార్కెఫెడ్, మార్కెటింగ్‌ శాఖ విక్రయించింది.

5,700 టన్నులు కొన్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు నుంచి 5,700 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశాం. 19 లారీల సరుకు జిల్లాకు రాగా, గూడెం మార్కెట్,  మార్కెట్‌ యార్డు ద్వారా అమ్మాం. అధికంగా క్వింటాలుకు రూ.500 వచ్చింది.  నాగమల్లిక, మార్కెఫెడ్‌ డీఎం 

రెండో పంటలో నాణ్యత ఉండదు
వేసవిలో వచ్చే కర్నూలు ఉల్లి రెండో పంట నాణ్యంగా ఉండదు. గత సీజన్‌లో ఉల్లికి రికార్డు ధర రావడంతో రైతులు పంటను వేశారు. నాణ్యత లేని కారణంగా రైతు ఆశించిన ధర రాలేదు.ఎన్‌.కృష్ణమూర్తి, వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement